ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని, కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ చేసిన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీ
జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం గతవారం ఆమోదం తెలిపింది. జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో మార్చి 14న హోలీ రోజు అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. అక్కడ స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్లకట్టలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. దీనిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ ఇచ్చిన నివేదికను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సుప్రీంకోర్టు.. జస్టిస్ వర్మ నివాసంలోని కాలిన నోట్ల కట్టల వీడియోలు, ఫోటోలు కూడా అందులో పెట్టింది.
త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ
ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. :కాగా, న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోన్న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా…. కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం జస్టిస్ వర్మ వివాదంపై ఢిల్లీ హైకోర్టు సీజే అందించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు విశ్వనీయ వర్గాలు పేర్కొన్నాయి.