ఏదయినా అన్యాయం జరిగితే కొంతకాలం పోరాడి, న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగదని వదిలేస్తాం. కానీ ఓ కుటుంబం మాత్రం కామాంధుడికి శిక్ష పడేంతవరకు పోరాడింది. 40 ఏళ్ల క్రితం ఆమె ఓ చిన్నారి. ఆ సమయంలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది. ఆ కోర్టు ఈ కోర్టు అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడికి శిక్షపడాలని, తమ చిన్నారిపై అత్యాచారం చేసిన వాడికి చట్టం తప్పకుండా శిక్షిస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని నమ్మి.. ఏకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. 1986లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి శిక్ష విధించాలని ఆదేశించింది.

కేసు పూర్తి వివరాలు
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ బాలికపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నవంబర్ 1987లో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, ట్రైయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదు. ఈ ఆధారాలతో శిక్ష విధించలేమంటూ రాజస్థాన్ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును పక్కన పెట్టిన కోర్టు
బాధితురాలు మైనర్, ఆమె మౌనాన్ని పెద్దల మౌనంతో సమానంగా చూడలేం. తనపై జరిగిన దారుణం నుంచి ఉద్భవించిన మౌనం అయిఉండొచ్చు. మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం” అని న్యాయమూర్తులు అన్నారు. నిందితుడు ఇప్పటికే శిక్ష అనుభవించకపోతే, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.