ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ఈ సందర్బంగా నాసాకు సంబందించిన వివరాలు వ్యోమగాములను గురించి తెలుసుకుందాం.
అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన అంశాల గురించి చరిత్రలో ఎక్కువగా చర్చించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఎవరు? చంద్రునిపై మొదట ఎవరు కాలుమోపారు? అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిందెవరు? వంటి ప్రశ్నల గురించి మీరు వినే ఉంటారు. కానీ, అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తులు భూమ్మీదకు తిరిగివచ్చే వార్తలకు చరిత్రలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అయితే, 2003 ఫిబ్రవరి 1తో ఈ పరిస్థితి మారిపోయింది. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు, అంతరిక్షంలో 17 రోజులు గడిపి ఇదే రోజున కొలంబియా అంతరిక్షనౌకలో భూమికి తిరుగు పయనం అయ్యారు.

సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది? :అంత అసాధారణ వేగంతో భూమి పైకి దూసుకొచ్చే అంతరిక్షనౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది. భగ్గుమనే ఉష్ణోగ్రతలను తట్టుకొని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది? ఈ ప్రక్రియను ‘అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ’ అని పిలుస్తారు. అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇదొకటి. దీన్నుంచి అంతరిక్షనౌకను రక్షించడానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను రూపొందిస్తున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ల భద్రత కోసం ఏఎంఈఎస్ వంటి పరిశోధనా సంస్థలపై నాసా ఆధారపడుతుంది.ఏఎంఈఎస్ కంపెనీ, ఉష్ణ కవచాలకు సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్, డిజైన్లు తయారు చేసింది.