Illicit Liquor Trade: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతోంది. గతంలో కేవలం కల్లు గీత కార్మికుల చేతుల్లో ఉన్న కల్లు అమ్మకాలు ప్రస్తుతం మాఫీయా ఆధీనంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కల్తీ కల్లు విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ప్రాణాంతకమైన, హానికరమైన రసాయనాలు ఉపయోగించడం ద్వారా కృత్రిమ పద్ధతిలో కల్లు తయారు చేస్తున్నారు. వాస్తవానికి తాటి, ఈత చెట్లు కలిగి ఉన్న సొసైటీలు మాత్రమే తమ సభ్యుల ద్వారా కల్లును విక్రయించాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడా తాటి, ఈత చెట్లు లేకపోయినా లక్ష లీటర్లకు పైగా కల్లును విక్రయిస్తున్నారు. కల్లు కాంపౌండ్లలో పూర్తి కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

గతంలో పది లీటర్ల కల్లుకు వంద లీటర్ల నీటిని, కొంత రసాయనాన్ని కలిపి నాసిరకం కల్లు తయారు చేసేవారు. ప్రస్తుతం అసలు కల్లు లేకుండా నగరంలోని కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని కల్లు దుకాణాలకు సంబంధించి సర్వేను నిర్వహించారు.
నగరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు తాటి, ఈత చెట్లు లేవని, కేవలం కల్తీ కల్లు మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నారని, దీనివల్ల వినియోగదారులు అనేక రుగ్మతలతో బాధపడటమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికల్లో అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. దీనితో నగరంలోని అన్ని కల్లు కాంపౌండ్లను మూసివేయడం జరిగింది.
అయితే 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కల్లు గీత కార్మికులు చేసిన విజ్ఞప్తి మేరకు తిరిగి కల్లు కాంపౌండ్లను తెరిచారు. కల్లు కాంపౌండ్ల నిర్వహణ వల్ల ఇటు ప్రభుత్వానికే కాకుండా కొందరు ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఆర్థిక వెసులుబాటు కలగడంతో లెక్కకు మించి కల్లు కాంపౌండ్లకు అనుమతి ఇచ్చారు.

కల్తీ కల్లులో కుంకుడు కాయ రసం..
Illicit Liquor Trade: కల్తీ కల్లులో కుంకుడు కాయ రసంతో పాటు అనేక రసాయనాలు కలుపుతారు. ముఖ్యంగా క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, ఆల్పజోలం వంటి రసాయనాలు ఎక్కువగా కలుపుతారు. దీనివల్ల ఒక బాటిల్ కల్లు సేవిస్తే చాలు ఎక్కువ నిషా ఎక్కుతుంది. దీనితో ఒకటి రెండు సార్లు తాగినవారు ఈ మేరకు మత్తు ఉంటేనే సేవించడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ రసాయనాలు కడుపులో మంట, పేగులలో రుగ్మతలకు దారితీస్తుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా లివర్ డ్యామేజీ చేస్తుంది. అదేవిధంగా కంటిచూపు కూడా మందగిస్తుంది. క్రమం తప్పకుండా అతిగా ఈ కల్తీ కల్లు సేవిస్తే ప్రాణాలు కూడా కోల్పోతారు.
కూకట్పల్లిలో మూడు కల్లు కాంపౌండ్లలో కల్లు సేవించిన 60 మంది వరకు ఆసుపత్రిలో చేరారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆల్పోజోలం వాడకం అధికం కావడంతో డిప్రెషన్, కేంద్ర నాడీ మండలం దెబ్బతింటుంది. 2004 నుంచి 2014 వరకు మూతపడిన కల్లు కాంపౌండ్లు తిరిగి 2014 నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో కల్లు విక్రయాలు నిలిపివేసినప్పుడు గీత కార్మిక సంఘాలు (Labor Unions) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ప్రతికూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు సైతం కల్లు విక్రయాలు హక్కు కాదని, దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తీర్పులో పేర్కొనడం జరిగింది. కల్లు నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్నామని బాధపడుతున్న గీత కార్మికులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన అవసరం ఉంది.
ఒకప్పుడు గుడుంబా హైదరాబాద్లో అతిపెద్ద వ్యాపారంగా కొనసాగింది.
ప్రభుత్వం ఉక్కుపాదంతో 2005లో పూర్తిగా నిర్మూలించగలిగింది. అయితే మరోపక్క కల్తీ కల్లు విక్రయాలకు తెరలేపింది. స్వచ్ఛమైన కల్లు తక్కువ మోతాదులో తీసుకోవడం కొంతవరకు ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ సాకుతో కల్తీ కల్లును విక్రయించడం సరికాదు. ప్రభుత్వమే నీరా కేఫ్లు తెరవడం, ప్రపంచ అందాల పోటీల సమయంలో సుందరీమణులతో నీరా సేవించేలా చేసి విస్తృత ప్రచారం చేయడం వల్ల ప్రజలను కల్లు సేవించడానికి ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తోంది.
ఇలాంటి విధానాలు సమాజంలో తప్పుడు పోకడలకు అవకాశం ఇస్తాయి.
ముఖ్యంగా కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉంది. అంతేకాకుండా ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి కల్లును నగరంలో విక్రయించకుండా నివారించడం మంచిది.