Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శ్రీరామనవమి పర్వదినం తర్వాతి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి పట్టాభిషేక వేదిక వద్దకు చేరుకున్నారు. పురోహితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తుల సాక్షిగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టాభిషేకనికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం. కాగా ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఇక, నిన్న సీఎం రేవంత్ దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా.. నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Read Also: ఇజ్రాయెల్ భీకర దాడి.. గాజాలో 32 మంది మృతి!