ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా 48వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది.భారీ ఛేదనలో ఢిల్లీకి ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. అనుకుల్ బౌలింగ్‌లో పొరెల్ (4) మిడాఫ్ వద్ద రసెల్ చేతికి చిక్కాడు. కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) కూడా నిరాశపరిచారు. కానీ డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. మూడు బౌండరీలతో హర్షిత్‌కు స్వాగతం పలికిన డుప్లెసిస్ వరుణ్ 8వ ఓవర్లో 4, 4, 6 దంచాడు. డుప్లెసిస్‌కు అక్షర్ జతకలవడంతో ఢిల్లీ స్కోరు వేగం ఊపందుకుంది. 31 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న డుప్లెసిస్ అదే జోరును కొనసాగించాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించిన ఈ ద్వయం ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా ఆడింది. 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నరైన్ 14వ ఓవర్లో విడదీశాడు. ఒకే ఓవర్లో అక్షర్‌తో పాటు స్టబ్స్(1)ను ఔట్ చేసి కోల్‌కతాను పోటీలోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు లక్ష్యం వైపు సాఫీగా సాగిన ఢిల్లీని డుప్లెసిస్‌ను ఔట్ చేయడం నరైన్ మళ్లీ దెబ్బకొట్టాడు. ఈసారి తన వంతు అన్నట్లు వరుణ్ 18వ ఓవర్‌లో వరుస బంతుల్లో అశుతోష్(7), స్టార్క్(0)ను ఔట్ చేసి కోల్‌కతా విజయానికి బాటలు వేశాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్(38) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.

పవర్ ప్లే
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ పిచ్ పరిస్థితి, పవర్ ప్లేలో ఢిల్లీ బౌలింగ్ ను పరిగణనలోకి తీసుకుంటే తాము 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామని చెప్పాడు. కొన్ని వికెట్లను కూడా సులభంగా కోల్పోయినట్లు అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే పవర్ ప్లే తర్వాత కోల్ కతా బ్యాటర్లను బాగా ఆపామని చెప్పుకొచ్చాడు.బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయినప్పటికీ ఇద్దరి నుంచి ముగ్గురు ఆటగాళ్లు బాగా సహకరించారని అక్షర్ పటేల్ తెలిపాడు.మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగిందని విప్రజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆశ ఉండేదన్నాడు. అశుతోష్ కూడా అక్కడ ఉండి ఉంటే బహుశా ఢిల్లీ మొదటి మ్యాచ్ లాగా అద్భుతాలు చేసి ఉండేదన్నాడు. తన గాయం గురించి అక్షర్ పటేల్ మాట్లాడుతూ ప్రాక్టీస్ సమయంలో తన చర్మంపై గాయాలైనట్లు చెప్పాడు. కానీ 3-4 రోజులు విరామం ఉందని. అప్పటివరకు తాను బాగానే ఉంటానని ఆశిస్తున్నట్లు అక్షర్ పటేల్ అన్నాడు.
Read Also : Uppal Stadium: హెచ్‌సీఏకు హై కోర్టు కీలక ఆదేశాలు!