అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడాలని ప్రయత్నించిన న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌కు అక్షర్ పటేల్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అక్షర్ వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అలెన్, కేవలం 9 పరుగుల వద్ద తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ తొలి వికెట్‌ను తక్కువ స్కోరుకే కోల్పోయి ఒత్తిడిలో పడింది. అక్షర్ తన స్పిన్ మాయాజాలంతో పవర్ ప్లేలో ప్రత్యర్థిని కట్టడి చేసి భారత్‌కు కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు.
తొలి వికెట్ పడిన కొద్దిసేపటికే ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా తన ప్రతాపం చూపాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకర బ్యాటర్ రచిన్ రవీంద్రను బూమ్రా తన పదునైన బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. బూమ్రా సంధించిన వేగవంతమైన బంతిని ఆడబోయి రవీంద్ర వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు భారీ రన్ రేట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భారత బౌలర్లు ఇదే జోరును కొనసాగిస్తే మూడోసారి ప్రపంచకప్ ముద్దాడటం టీమ్ ఇండియాకు నల్లేరుపై నడకే అనిపిస్తోంది.