ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025 లో భాగంగా,తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. 59 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఢిల్లీ కొంపముంచింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ముంబైని అధిగమించే పరిస్థితి ఢిల్లీకి లేదు. భారీ తేడాతో ఓడిపోవడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. దాంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.
టాప్ స్కోరర్లు
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.

పరుగులు
లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(11), ఫాఫ్ డుప్లెసిస్(6) తీవ్రంగా నిరాశపరిచారు. అభిషేక్ పోరెల్(6) కూడా ఔటవ్వడంతో పవర్ ప్లేలోనే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఆ వెంటనే నిలకడగా ఆడిన విప్రజ్ నిగమ్‌ను మిచెల్ సాంట్నర్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ కు చేర్చాడు. ట్రిస్టన్ స్టబ్స్(2)ను బుమ్రా ఔట్ చేయడంతో ఢిల్లీ 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నిలకడగా ఆడిన సమీర్ రిజ్వీ(Sameer Rizvi)ని క్లీన్ బౌల్డ్ చేసిన మిచెల్ సాంట్నర్ అషుతోష్ శర్మ(18)ను స్టంపౌట్ చేశాడు. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. మధవ్ తివారి, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను బుమ్రా పెవిలియన్ చేర్చి ముంబై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
Read Also: IPL 2025: ప్లేఆఫ్స్‌కు ముందు నియమాన్ని మార్చిన బీసీసీఐ కేకేఆర్ ఆగ్రహం