ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు ఓ స్కూటీని ఢీ కొట్టడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడని, ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంఘటనతో మను భాకర్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మను భాకర్ ఇటీవలే తన అద్భుతమైన ప్రదర్శనతో క్రీడా ప్రపంచంలో గుర్తింపు పొందారు. పారిస్‌లో గతేడాది జరిగిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకొని దేశానికి గౌరవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది.
రెండు రోజుల క్రితమే మను భాకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు స్వీకరించారు. ఈ ఆనంద సమయంలో మను ఇంట్లో ప్రమాదం జరగడం, అమ్మమ్మ, మామలను కోల్పోవడం ఆమెను విషాదంలో పడేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు క్రీడా ప్రియులు, మను అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.