వచ్చే టీ20 ముంబై లీగ్‌లో కొత్త జట్టు అయిన సోబో ముంబై ఫాల్కన్స్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ముంబై సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్ ఓంకార్ సాల్వి జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. ఓంకార్ సాల్వి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కపిల్ దేవ్ ఉండటం జట్టుకు గణనీయంగా ఊతం ఇస్తుందని జట్టు సహ యజమాని అమీత్ హర్జిందర్ గధోకే అభిప్రాయపడ్డారు. రాబోయే టీ20 ముంబై లీగ్‌లోని రెండు కొత్త జట్లలో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఒకటి.ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ జట్టు సహ యజమాని అమీత్ హర్జిందర్ గఢోకే మాట్లాడుతూ “కపిల్ దేవ్ మా జట్టుకు అంబాసిడర్ గా ఉంటారు. ఆయన గత 6 సంవత్సరాలుగా మా రేసింగ్ జట్టు ముంబై ఫాల్కన్స్‌కు మెంటర్‌గా ఉన్నారు. కపిల్ దేవ్ మా జట్టు ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు. ఆయన ఒకటి లేదు రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటారు. ముంబైలో జరిగే జట్టు మ్యాచ్‌లకు హాజరవుతారు. ఆయన ఉనికి మా జట్టుకి గొప్ప ప్రోత్సాహన్ని ఇస్తుంది.” అని అన్నారు.

మూడో సీజన్
ముంబై ఫాల్కన్స్ రేసింగ్ జట్టును నవంబర్ 2019లో గఢోక్ గ్రూప్ స్థాపించింది. వారు 2021లో ఎఫ్3 ఆసియా ఛాంపియన్ షిప్‌లోకి ప్రవేశించారు. రేసర్లు కుష్ మైనీ, జెహాన్ దారువాలాతో కలిసి ఎఫ్3 ఆసియా ఛాంపియన్ షిప్‌లో పోటీపడి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన తొలి భారతీయ జట్టుగా ఇది నిలిచింది.ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ తరహాలో ప్రతి రాష్ట్రం టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్నాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. దీన్ని ముంబై టీ20 లీగ్ అని పిలుస్తారు. ఈ లీగ్ మూడో సీజన్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తర్వాత ప్రారంభమవుతుంది. ఈ లీగ్ వేలం తేదీలను ముంబై క్రికెట్ అసోసియేషన్ త్వరలో ప్రకటించనుంది. ఈ లీగ్ ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది. ఇది మూడో సీజన్ కావడం గమనార్హం. లీగ్ చివరి సీజన్ కొవిడ్ కంటే ముందే జరిగింది. ముంబై టీ20 లీగ్ మే 26 నుంచి జూన్ 8 వరకు వాంఖడే స్టేడియంలో నిర్వహించబడుతుంది.ఇలా ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం, అనుభవజ్ఞులైన కోచింగ్ సిబ్బంది ఉండటం వంటి అంశాలు జట్టును స్థిరంగా నిలిపే అవకాశం కల్పిస్తాయి. ఫలితంగా సోబో ముంబై ఫాల్కన్స్ టీ20 ముంబై లీగ్‌లో మంచి ప్రదర్శన చూపించి అభిమానుల మనసు గెలుచుకుంటుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: IPL 2025: ఢిల్లీ ఓటమి పై అక్షర్ పటేల్ ఏమన్నారంటే!