ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025 లో భాగంగా,ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. 59 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఢిల్లీ కొంపముంచింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ముంబైని అధిగమించే పరిస్థితి ఢిల్లీకి లేదు. భారీ తేడాతో ఓడిపోవడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. దాంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టుకు మెరుగైన స్కోరునందిస్తే మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) నిప్పులు చెరిగి ఢిల్లీ కథ ముగించారు.ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు ఖరారు చేసుకోగా ఆఖరి ప్లేస్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అయితే ఇరు జట్లకు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్ చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోవడమే ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్(Mumbai Indians) 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించినా 15 పాయింట్స్ మాత్రమే వస్తాయి. దాంతోనే ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందడుగు వేసింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.

టాప్ స్కోరర్లు
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.
Read Also: MI vs DC: ఢిల్లీ పై ముంబై ఘన విజయం