పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నేడు లోక్ సభలో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై ప్రత్యేక చర్చ జరగనుంది. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతికార చర్యలపై ఉభయ సభల్లోనూ 16 గంటల ప్రత్యేక చర్చకి సమయం కేటాయించారు. ఈ రోజు లోక్‌సభలో, రేపు రాజ్యసభలో ఈ అంశంపై వాడివేడి చర్చ జరగనుంది. ఈ చర్చ కోసం ఎన్డీయే, ఐఎన్‌డీఐ కూటములు సమగ్రంగా సిద్ధమవుతున్నాయి.
జాతీయ భద్రత – విదేశాంగ విధానాలపై మక్కువ
ఈ చర్చలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలతో పాటు జాతీయ భద్రతా విధానాలు, విదేశాంగ విధానాలపై కూడా విశ్లేషణ జరుగనుంది. ఉగ్రవాదంపై భారత వైఖరి, గూఢచార విభాగాల సమాచారం, అంతర్జాతీయ స్పందన వంటి అంశాలపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రభుత్వం సమర్థించనుంది, మరొకవైపు విపక్షాలు సమగ్ర సమీక్ష కోరే అవకాశం ఉంది.
చర్చలో ప్రధాని మోదీతో పాటు కీలక నేతల హాజరు
ఈ చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నట్లు సమాచారం. భద్రతా పరంగా దేశాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ఈ చర్చతో పార్లమెంట్ వేదికగా దేశ భద్రతపై సమగ్ర చర్చ జరగనుండగా, ప్రజల దృష్టి ఇప్పుడు ఈ చర్చపై నిలిచింది.
Read Also ; Lulu Mall : విజయవాడలోనూ లులు మాల్ కు స్థలం!