ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వడ్లమాను ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఇప్పుడు ఆడబిడ్డల పరువు తీసే మాధ్యమంగా మారిపోయిందని, దీనిపై ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారి జీవితం అదే రోజుతో ముగుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

నైతిక విలువలు నేర్పే సమయం
సామాజిక మాధ్యమాలు అసభ్యతకు వేదికగా మారకూడదని సీఎం హెచ్చరించారు. మహిళలను గౌరవించాలన్నది ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకరమైన కామెంట్లు, పోస్ట్‌లు పెట్టడాన్ని తీవ్రంగా తీసుకుంటామని, ఇకపై ఈ అంశంపై ప్రభుత్వం సున్నితంగా లేకుండా వ్యవహరిస్తుందని చెప్పారు. యువతకు సానుకూలమైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని, కుటుంబం నుండి సమాజం దాకా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
నేరస్తులకు కఠిన శిక్షలు
ఇలా మహిళలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యతకు పాల్పడేవారిపై ప్రభుత్వ మిషన్ గట్టిగా పని చేస్తుందని హెచ్చరించారు. పోలీస్ విభాగానికి ప్రత్యేక సూచనలు ఇచ్చామని, సాంకేతిక నేరాలపై నిఘా పెంచి, నిందితులపై కఠిన శిక్షలు విధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాజంలో మహిళల భద్రత, గౌరవం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.