Moral Story: అడవిలో ఒకరోజు పులి జింకను పట్టుకొని తన గుహకు తెచ్చుకొని తినసాగింది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న గుహలోని వృద్ధ సింహం పిలిచింది. పులి బయటకు వచ్చి “ఏమిటి సింహం తాతా? ఏం కావాలి?” అనడిగింది.
“మా పిల్లలు నాకు ఆహారం తెస్తానని వెళ్లారు. ఇంకా రాలేదు. ఆకలిగా వుంది. నీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే ఇస్తావా? పిల్లలు తెచ్చే ఆహారం నీకు ఇస్తాను” అంది వృద్ధ సింహం.

“సింహం తాతా! ఇంతకుముందు అడిగినా ఇచ్చేవాడిని. ఇప్పుడే జింక మాంసం పూర్తిగా తినేసాను. ఈసారి వేటకెళితే ఇస్తానులే” అంటూ అబద్ధం చెప్పింది. “చాలా ఆకలిగా వుంది. వేటాడే శక్తి లేదు” అంటూ బాధగా వెళ్లింది. పులి గుహలోకి వెళ్లి మిగిలిన జింకమాంసం ఎక్కువనిపించినా కష్టపడి మెల్లగా తినింది.
ఒకరోజు పులి కాలుకు పెద్ద గాయం అవడంతో గుహ దాటి బయటకు రాలేక బాధతో మూలగసాగింది. పులి మూలుగు శబ్దం విని వృద్ధ సింహం వచ్చింది.

Moral Story: “వేటకు కూడా వెళ్లలేవు కదూ. అయ్యో పాపం ఆకలిగా ఉందా?” అడిగింది వృద్ధ సింహం. “ఔను సింహం తాతా” అంది.
“నేను ఇంతకు ముందే తిన్నాను. మళ్లీ నా పిల్లలు ఏదైనా ఆహారం తెస్తే నీకు ఇస్తానులే” అంటూ వెళ్ళిపోయింది.
“ఆ రోజు నేను అబద్ధం చెప్పినట్లే ఈరోజు వృద్ధ సింహం ఆహారం ఉన్నా కూడా అబద్ధం చెబుతోంది” అని అనుకుంది పులి.
కొంత సమయం తరువాత సింహం లోపలికి వచ్చి “పులీ, ఇప్పుడే నా పిల్లలు కుందేలు మాంసం తెచ్చారు. నీకు ఆకలిగా వుందన్నావుగా!” తిను అంటూ కుందేలుమాంసం పులి ముందు వుంచింది.
“నన్ను క్షమించు తాతా, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను. అలాగే నీవు కూడా అబద్ధం చెప్పావనుకొని పొరపాటు పడ్డాను. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని అంటారు. నాకు అలాగే అనిపించింది” అంది.
“నీవు అబద్ధం చెప్పగానే అందరూ అబద్ధాలు చెబుతున్నారనుకొన్నావా? ఇక మీదట అబద్ధాలు చెప్పవద్దు” అని చిరునవ్వుతో అంది వృద్ధ సింహం.
