ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలపై మరోసారి తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నిలిచిపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు సేవలు నిలిపివేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

రూ.3500 కోట్ల బకాయిలతో సేవలకు బ్రేక్
నెట్‌వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత తొమ్మిది నెలలుగా వీటిపై చెల్లింపులు జరగకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించే ముఖ్యమైన ప్లాట్‌ఫాం. ఎంతో మంది ఈ పథకంపై ఆధారపడి తమ వైద్య ఖర్చులను భరించగలుగుతున్నారు. కానీ ప్రభుత్వం తరఫున బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు ఇకపై ఈ సేవలను అందించలేమని చెప్పడమే ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారింది.
షర్మిల విమర్శలు – కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. పేరుకు రైజింగ్ స్టేట్ అంటారు కానీ ప్రజలకు కనీస వైద్యసేవలు అందించలేని స్థితిలో రాష్ట్రం ఉందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగా నిధులను విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వైద్య రంగాన్ని ప్రోత్సహిస్తామని, ప్రపంచ స్థాయిలో హెల్త్ సిటీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే, ఆ హామీలు కేవలం మాటలకే పరిమితమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అత్యవసర చికిత్స అవసరమైన పేద ప్రజలే అసలు బాధితులు. ఎంతో మంది వైద్య ఖర్చులు భరించలేక ఆరోగ్యశ్రీ మీద ఆధారపడతారు. కానీ ఇప్పుడు సేవలు నిలిచిపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఇది కేవలం వైఫల్యం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల -వైద్యం అందక మృతి చెందే ఏ ఒక్కరిపైనా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆసుపత్రుల యాజమాన్యాలతో తక్షణం చర్చలు ప్రారంభించాలి. పెండింగ్‌లో ఉన్న రూ.3,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ..ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read also: Aarogyasri : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!