తెలంగాణ ప్రభుత్వం మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా చేసేందుకు యెంత కృషి చేస్తున్నా, ఆశించిన ఫలితం పొందడం లేదు. తాజాగా విదేశాల నుంచి ఖరీదైన గంజాయిని తెప్పించి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమ్ముతున్న వ్యక్తిని.. సిటీ శివారులోని రాయదుర్గంలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అమెరికా.. కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో హై క్వాలిటీ ఓ జీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి బెంగళూరుకి తెప్పించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి తెప్పిస్తున్నారు.
ఈ హై క్వాలిటీ గంజాయిలో టెట్రా హైడ్రో క్యాన్బినాన్ మత్తు పదార్థాన్ని కూడా కలుపుతున్నారు. సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం THC ఉంటే.. ఈ హై క్వాలిటీ గంజాయిలో అది 25 శాతం ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి విపరీతమైన కిక్ ఇస్తుందని.. కొందరు దీన్ని ఎక్కువ డబ్బు చెల్లించి కొంటున్నారు.
ఈ గంజాయిని ఒక గ్రాము రూ.3వేలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం రాగానే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రాయదుర్గంలోని టింబర్ లేక్ వ్యాలీ కాలనీ, ప్రశాంతి హిల్స్‌లో తనిఖీలు చేశారు. అక్కడ అక్రమంగా తరలిస్తున్న ఓ జీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ఇద్దరు నిందితుల నుంచి 175 గ్రాముల ఓజి కుష్ గంజాయిని, ఒక కేజీ లూజ్ డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు అరెస్ట్ అవ్వగా.. బెంగళూరుకు చెందిన అజయ్ అనే వ్యక్తి పారిపోయాడు. పోలీసులకు దొరికిన వ్యక్తి శివరాం.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. తనే ఈ గంజాయిని హైదరాబాద్‌కి తెప్పించి.. తన తోటి ఉద్యోగులకు అమ్ముతున్నాడని తెలిసింది. ఇప్పుడు పోలీసులు.. ఈ గంజాయి విదేశీ మూలలపై ఫోకస్ పెడుతున్నారు. కర్ణాటక పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు.