దేశంలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ తప్పనిసరిగా డిజిటల్(Digital transactions) ద్వారా గాని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా గాని జరగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపుగా అంటే 95 శాతం వరకూ ఆన్లైన్ డిజిటల్ విధానం ద్వారానే లావాదేవీలు సాగుతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. దీనివల్ల దేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కలుగుతుంది.
నిజానికి యుపిఐ(UPI) ద్వారా చెల్లింపులు మన దేశంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. అది కూడా నోట్ల రద్దు సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆన్లైన్ విధానానికి అలవాటు పడారు. పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, వాట్సప్, భారత్పే ఇలా ఎన్నో పేమెంట్ సంస్థలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
నగదు బదిలీ త్వరగా, సురక్షితంగా కావడంతో ప్రజలు త్వరగానే డిజిటల్(Digital transactions) నగదు బదిలీకి అలవాటు పడ్డారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా డిజిటల్ వేదిక ద్వారా నగదు వ్యవహారాలు కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది. పది రూపాయల టీ కొనుగోలు నుంచి కిరాణ, సినిమా టికెట్లు, రైల్వే, బస్సు టికెట్లు, పెట్రోలు బంకులు, మాల్స్ వద్ద డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి.

అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజు దేశ వ్యాప్తంగా సుమారు 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు యుపిఐ ద్వారా జరుగుతున్నాయి. డిజిటల్ (Digital transactions) మనీ ట్రాన్స్ఫర్ సులభతరం. త్వరితగతం కావడంతో ప్రజలు ఈ విధానానికి మద్దతుగా పలుకుతున్నారు.
గతంలో రహదారుల్లో ప్రయాణించే సమయంలో టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. దీనివల్ల ప్రయాణ సమయం ఎక్కువ కావడం, గమ్యం చేరుకునే సమయంలో ఎక్కువ వ్యత్యాసం రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ వచ్చిన తరువాత చాలా టోల్‌గేట్ వద్ద నిమిషానికి మించి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతోంది.
అదేవిధంగా పలు సందర్భాల్లో చిల్లర సమస్య ఎదురయ్యేది. ఏదైనా వస్తువు 87 రూపాయలు చెబితే దానికి సరిపడా చిల్లర ఇటు వినియోగదారుడి వద్ద గాని, అటు వ్యాపారి వద్ద గాని ఉండేది కాదు. ప్రస్తుతం ఎంత మొత్తం కావాలో ఆమేరకు వెంటనే చెల్లించే సౌలభ్యం కలుగుతోంది.
ప్రారంభంలో డిజిటల్ (Digital transactions) లావాదేవీల్లో సాంకేతిక సమస్యలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అవి కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. వంద లావాదేవీల్లో ఒకటి, రెండు మాత్రమే సమస్యతో కూడుకుటున్నవి ఉంటాయని, వాటిని కూడా పరస్పరం సంప్రదింపుల ద్వారా వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు యుపిఐ సంస్థలు పేర్కొంటున్నాయి.
డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, న్యూఢిల్లీని మించి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు డిజిటల్స్ టాట్ ఫాంపై జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సర్వేలో హైదరాబాద్ ప్రధమ స్థానంలో ఉండగా ఆ తరువాత వరుసగా తొమ్మిది స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, కొయంబత్తూరు, అహ్మదాబాద్, వడోదర నగరాలు ఉన్నాయి.
ఇక క్రెడిట్ కార్డులు, డిబిట్ కార్డుల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్ విధానంలోను, యుపిఐ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరగడం వల్ల ఇటు వినియోగదారులకు, అటు ప్రభుత్వానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

నగదు లావాదేవీల్లో పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రాబడి గణనీయంగా తగ్గుతుంది. ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి.
నోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్ విధానంలో అమలులోకి వచ్చినప్పటికీ, కరోనా సమయంలో లావాదేవీలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం చాలారంగాల్లో నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. అయితే కోట్ల రూపాయల్లో వ్యాపారాలు చేసే కొన్ని సంస్థలు మాత్రం ఇప్పటికీ నగదు లావాదేవీలపైనే ఆధారపడుతున్నాయి.
కిరాణా హోల్సేల్, చేపలు, రొయ్యలు విక్రయాలు, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ రంగం వంటి అనేక వ్యాపార సంస్థలు నిత్యం కోట్లలో వ్యాపారం చేస్తున్నా అవి చాలావరకు నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అత్యధిక బంగారం దుకాణాల్లో నగదు చెల్లిస్తే ఒక రేటు, ఆన్లైన్ ద్వారా బిల్లు చెల్లిస్తే మరో రేటు చెబుతున్నారు. కొందరు వినియోగదారులకు పది రూపాయలు తక్కువకు వస్తోంది కాదని డబ్బు చెల్లించి సరుకు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పన్నులకు గండిపడుతోంది.
మరోపక్క వస్తువు నాణ్యత విషయంలోనో, ఏదైనా ఇతర కారణాల వల్ల వినియోగదారుడు ఇబ్బంది పడితే ఆయా వ్యాపార సంస్థలను ప్రశ్నించే అవకాశం ఉండటం లేదు. అదే డిజిటల్ లావాదేవీ అయితే మన వద్ద స్పష్టమైన సాక్ష్యాధారాలు లభిస్తాయి.
ఈ కారణంగా దుకాణదారులు కూడా సాధ్యమైనంత వరకు డిజిటల్ లావాదేవీలు జరిగే సమయంలో కొంత అప్రమత్తతతో ఉంటారు. మన దేశంలో ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరిగినా ఆశించిన మేరకు మాత్రం పెరగలేదనే ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
నూటికి 80 నుంచి 90 శాతం వరకు డిజిటల్ లావాదేవీల ద్వారానే ఆర్థిక వ్యవహారాలు కొనసాగినప్పుడే నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి అవుతాయని, ప్రభుత్వాలు మెరుగైన సేవలను ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఏ లావాదేవీ జరిగినా తప్పనిసరిగా డిజిటల్ మార్గాల ద్వారా చేయడంతో పాటు సదరు లావాదేవీకి జిఎస్టి నెంబర్ ఉన్న రశీదును పొందేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆయా ప్రాంతాలు ఇతోధిక అభివృద్ధిని సాధిస్తాయి.
Read Also: Road accidents: ఆందోళన కల్గిస్తున్న రోడ్డు ప్రమాదాలు