నల్ల సముద్రంలో నౌకాదళ కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ అమెరికాతో వేరువేరు ఒప్పందాల్లో అంగీకరించాయి. సౌదీ అరేబియాలో మూడు రోజులపాటు జరిగిన శాంతి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల నల్లసముద్రంలో వాణిజ్య నౌకా మార్గ పునరుద్ధరణకు అవకాశం కలుగుతుందని, అన్నిపక్షాలు శాశ్వత శాంతి దిశగా పనిచేస్తాయని వాషింగ్టన్ తెలిపింది. ఒకరి ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద మరొకరు దాడి చేసుకోవడంపై గతంలో అంగీకరించిన నిషేధాన్ని అమలు చేయడంలో ‘మరింత ముందుకు వెళ్లడానికి’ వారు కట్టుబడి ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది.

ఆంక్షలను ఎత్తివేసిన తర్వాతే నౌకాదళ కాల్పుల విరమణ
అయితే తమ ఆహారం, ఎరువుల వ్యాపారంపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేసిన తర్వాతే నౌకాదళ కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని రష్యా తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈమేరకు రియాద్‌లో ఇరుదేశాల ప్రతినిధులతో వేరువేరుగా చర్చలు జరిగాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు నేరుగా చర్చలు జరపలేదు. నల్ల సముద్రంలో కాల్పుల విరమణ సరైన దిశగా వేసిన ముందడుగు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు. ”ఇది సాకారమవుతుందని చెప్పడం తొందరపాటే అవుతుంది. కానీ ఇవి సరైన చర్చలు, సరైన నిర్ణయాలు, సరైన అడుగులు’’ అని కీయేవ్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ”శాంతిస్థాపన దిశగా సాగడం లేదని ఇకపై ఉక్రెయిన్‌పై ఎవరూ ఆరోపణలు చేయరు” అని ఆయన అన్నారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అడ్డుకుంటోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు.
వాషింగ్టన్ ప్రకటన
వాషింగ్టన్ ప్రకటన వెలువడిన కొంతసేపటికే, అంతర్జాతీయ ఆహార, ఎరువుల వ్యాపారాల్లో పాలుపంచుకుంటున్న రష్యా బ్యాంకులు, ఉత్పత్తి, ఎగుమతిదారులపై ఆంక్షలు ఎత్తివేసే వరకు నల్ల సముద్రం కాల్పుల విరమణ అమల్లోకి రాదని రష్యా తెలిపింది. సంబంధిత బ్యాంకులను స్విఫ్ట్ పే చెల్లింపు వ్యవస్థకు అనుసంధానం చేయడం, ఆహార వాణిజ్యంలోని రష్యన్ నౌకలకు సేవలందించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఆహార ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ యంత్రాలు, ఇతర వస్తువుల సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని రష్యా డిమాండ్ చేసింది.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై స్పష్టంగా లేదు
అయితే నల్ల సముద్రంలో కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయం శ్వేతసౌధం ప్రకటనలో స్పష్టంగా లేదు. ఆంక్షల ఎత్తివేత గురించి రిపోర్టర్లు ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు ”మేం అన్నింటి గురించి ఇప్పుడే ఆలోచిస్తాం. పరిశీలిస్తాం” అని చెప్పారు. యుఎస్, రష్యా చర్చల కారణంగా ”ఎరువుల, వ్యవసాయ ఎగుమతుల ప్రపంచ మార్కెట్‌లోకి రష్యా పునరాగమనానికి అమెరికా సాయపడుతుంది” అని వాషింగ్టన్ ప్రకటన తెలిపింది. దీనిపై జెలియెన్‌స్కీ స్పందిస్తూ, మాస్కో తన కట్టుబాట్లను ఉల్లంఘిస్తే రష్యాపై మరిన్ని ఆంక్షలు, అమెరికా నుంచి మరింత సైనిక మద్దతు కోసం ఉక్రెయిన్ ఒత్తిడి తెస్తుందన్నారు.
‘రష్యా అబద్ధాలు చెబుతోంది’
ఆంక్షలను ఎత్తివేయడంపైనే నల్లసముద్రం కాల్పుల విరమణ ఆధారపడి ఉంటుందంటూ రష్యా అబద్ధాలు చెబుతోందని యుక్రెనియన్లను ఉద్దేశించి జెలియెన్‌స్కీ పొద్దుపోయిన తరువాత చేసిన ప్రసంగంలో చెప్పారు. ఇతర దేశాలు ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించవచ్చని ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెమ్ ఉమెరోవ్ తెలిపారు. అయితే రష్యా యుద్ధనౌకలను నల్ల సముద్రం తూర్పు భాగాన్ని దాటి తరలించడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఉక్రెయిన్ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇలాంటి సందర్భంలో ఉక్రెయిన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకునే పూర్తి హక్కును కలిగి ఉంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన తరువాత 2022లో నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి వీలుగా ఒప్పందం కుదిరింది.