అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వలసలపై, విదేశీ విద్యార్థులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఏదో ఒక కారణంతో వీరిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో అక్రమ వలసల్ని వారి స్వదేశాలకు విమానాలు ఎక్కించి మరీ పంపేశారు. అలాగే విదేశీ విద్యార్ధులను వివిధ కారణాలతో వీసాలు రద్దు చేసి వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలకు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది.

ట్రంప్ సర్కార్ ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట
అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం కోసం వచ్చిన భారతీయులు సహా మొత్తం 133 మంది విదేశీ విద్యార్ధులకు ఇవాళ జార్జియా కోర్టు ఊరటనిచ్చింది. వివిధ కారణాలతో వీరి వీసాల రద్దు కోసం ట్రంప్ సర్కార్ చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట వేసింది. చట్టవిరుద్ధమైన సెవిస్ తొలగింపులకు గురైన 133 మంది అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించారు.
తాత్కాలిక నిషేధ ఉత్తర్వు జారీ
అమెరికా ఫెడరల్ కోర్టు విద్యార్థుల సెవిస్ రికార్డులను పునరుద్ధరించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖను కోరుతూ తాత్కాలిక నిషేధ ఉత్తర్వు జారీ చేసింది. వ్యాజ్యం వెలుపల విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించకుండా లేదా బహిర్గతం చేయకుండా ఫెడరల్ అధికారులను కోర్టు అడ్డుకుంది. విద్యార్థులకు జారీ చేసిన లేఖలలో ఎటువంటి నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొనబడలేదని తెలిపింది. దీంతో ప్రభుత్వ చర్యలను న్యాయవాదులు తప్పుబట్టారు. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసి, వారి సెవిస్ రికార్డులను రద్దు చేసిన తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఈ ఉత్తర్వులు ఇవ్వకపోతే మాత్రం ఆయా విద్యార్దుల్ని దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం ఉండేది.
ఈ విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) రికార్డులు చట్టవిరుద్ధంగా తొలగించబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు విద్యార్థుల సెవిస్ రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: India : పాకిస్థాన్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్