ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జరపనున్న విజయోత్సవ పరేడ్ పై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో ఈ రోజు సాయంత్రం విక్టరీ పరేడ్(Victory Parade) నిర్వహించాలని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. కానీ ఈ విక్టరీ పరేడ్‌కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, విక్టరీ పరేడ్‌కు బందోబస్తు కుదురదని పోలీసులు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ విక్టరీ పరేడ్‌కు అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్మాన కార్యక్రమాన్ని ఆర్‌సీబీ(RCB) ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫైనల్లో ఆర్‌సీబీ
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారినే అనుమతించనున్నారు. పార్కింగ్ సమస్య(Parking problem) రాకుండా అభిమానులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఆర్‌సీబీ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

విజయాన్ని సెలెబ్రేట్
బెంగళూరు నగరంలోనే కాకుండా హైదరాబాద్, పుణె, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆర్‌సీబీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లుగా ఆర్‌సీబీని అంటిపెట్టుకున్న అభిమానులతో కలిసి బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఫ్రాంచైజీ(Franchise) నిర్ణయించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ఆర్‌సీబీ ఓ ప్రకటనను కూడా చేసింది.’బెంగళూరులో ఆర్‌సీబీ విక్టరీ పరేడ్ ఉంది. అభిమానుల కోసమే ఈ ర్యాలీ. మీ ప్రతీ సంబరం, కన్నీటి చుక్క కోసమే ఇది. లాయల్టీనే రాయల్టీ. నేటి ఈ టైటిల్ మీదే’అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఈ విక్టరీ పరేడ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్(Star Sports Network)తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో విక్టరీ పరేడ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే విక్టరీ పరేడ్ రద్దు చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బెంగళూరు పోలీసులపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.