తెలంగాణ బీజేపీని బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం, ఒత్తిడికి గురిచేస్తూ, తన పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె, జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే ‘ రైల్ రోకో ‘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమంలో కొత్త దశకు అడుగుపెడుతున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill) కేంద్రం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండగా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.అంశంపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు లేఖ రాసినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని
ఆయన చొరవ తీసుకొని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు.ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించలేదని ఆమె విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని కవిత విమర్శించారు. మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీపైనా ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ మేరకు తాను ఖర్గేకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.కులగణన వివరాలు బయట పెట్టాలని తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం పాత లెక్కలే చెబుతున్నారని కవిత ఆరోపించారు.

కులగణన వివరాలు
గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని కవిత ఆరోపించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని గుర్తు చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బనకచర్లను ఆపేందుకు గట్టిగా కొట్లాడాలని కవిత సూచించారు. ఇక రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు తనది బీఆర్ఎస్ పార్టీనేనని, రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అనంతరం రైల్ రోకో పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
Read Also: Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య