దేశవ్యాప్తంగా రైళ్లలో నిత్యం ప్రయాణాలు చేసే వారిలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇలా జనరల్ టికెట్ పై ప్రయాణాలు చేసే వారికి ప్రస్తుతం వరిస్తున్న వర్తిస్తున్న నిబంధనల్లో రైల్వే మార్పులు చేయబోతోంది. త్వరలో అమల్లోకి వచ్చే ఈ రూల్స్ నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వే శాఖ జనరల్ టికెట్ ప్రయాణికులకు అమల్లోకి తీసుకురాబోతున్న తాజా రూల్స్ ఇలా వున్నాయి.
రైల్వే మార్పులు
జనరల్ టికెట్ బుకింగ్‌కు చేసుకునే రూల్స్ లో రైల్వే మార్పులు చేయబోతోంది. మార్పులు అమల్లోకి వచ్చాక జనరల్ టిక్కెట్‌పై చేసే ప్రయాణాల్లో టికెట్ పై రైలు పేరు కచ్చితంగా ఉంటుంది. దీంతో ప్రయాణీకులు తాము టికెట్ తీసుకున్న రైల్లో మాత్రమే ప్రయాణాలు చేసేందుకు వీలు ఉంటుంది. ఇతర రైళ్లలో ఎక్కడం కుదరదు. అలాగే జనరల్ టికెట్ చెల్లుబాటు వ్యవధి కేవలం మూడు గంటలకే పరిమితం చేయబోతున్నారు.
ఓసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల్లో ప్రయాణీకుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే ఆ టిక్కెట్ చెల్లదు. తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న కుంభమేళా ప్రయాణికుల తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రద్దీని తగ్గించడం కోసమేనా?
తాజా చర్యలతో రైళ్లలో అనవసరమైన రద్దీని తగ్గించడం, ప్రయాణ భద్రత, సున్నితత్వాన్ని పెంచడం లక్ష్యంగా తెలుస్తోంది.ప్రస్తుతం భారతీయ రైల్వే అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) కింద ప్రయాణికులు స్టేషన్ టిక్కెట్ కౌంటర్‌లో లేదా యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ టిక్కెట్‌లు సాధారణంగా ప్రయాణ తేదీ , మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి. టిక్కెట్ చెల్లుబాటులో ఉంటే ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.