బాలీవుడ్ నటుల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, యాక్షన్, మాస్, కామెడీ, డ్రామా, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న నటుడు అజయ్ దేవగన్. ఇప్పుడు ఆయన మరోసారి మాస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైడ్ 2. ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇదివరకు ‘రైడ్’ అనే చిత్రాన్ని 2018లో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవితంలో జరిగిన ఆదాయపు పన్ను దాడులను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం అజయ్ దేవగన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది.
పనోరమా స్టూడియోస్
ఈ సీక్వెల్‌లోనూ అజయ్ దేవగన్ ఆదాయపు పన్ను శాఖ అధికారి పాత్రలోనే కనిపించనున్నారు. కానీ ఈ సారి కథ మరింత బలంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉండనుందని సమాచారం.ఎప్పటిలాగే అజయ్ దేవగన్ శక్తివంతమైన పాత్రలో, అధికారంగా, గంభీరంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు.రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
హింసాత్మక స్వభావం
ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రలేకుండా చేస్తుంటాడు. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుతాయి.ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది.ట్రైలర్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన ప్రధాన అంశాల్లో రితేష్ దేశ్‌ముఖ్ పాత్ర ఒకటి. ఆయన దాదాభాయి అనే రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు,వెలుపల ఆకర్షణీయంగా కనిపించే ఈ వ్యక్తి, లోపల మాత్రం హింసాత్మక స్వభావం కలిగి ఉంటాడు. ట్రైలర్‌లో రితేష్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. తాను దాచిన రహస్యాలను రక్షించుకునేందుకు ఏదైనా చేయగల వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించారు. అజయ్, రితేష్ మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.గతంలో వీరిద్దరూ టోటల్ ధమాల్ సినిమాలో కలిసి నటించారు.
Read Also: OTT: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ ఇవే..