Ration shops : ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జూన్ నెల నుంచి రేషన్‌కార్డులు ఉన్నవారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. రేషన్‌కార్డులు ఉన్నవారు రేషన్ బియ్యానికి బదులుగా రాగులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

రెండు కేజీలు రాగులు
ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీలు రాగులు కావాలనుకుంటే.. ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలా ప్లాన్ చేశారు అధికారులు. అయితే ఏడాదికి దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాగులు సేకరించేందుకు తాజాగా టెండర్ నోటీసు జారీ చేసింది. జూన్ నెల నుంచి రాగుల్ని పంపిణీ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలో రేషన్ కార్డుదారులు ఉన్నవారికి ఈ నెలలోనూ కూడా కందిపప్పు అరకొరగా అందుతున్నాయి. ఈ నెల కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు.
ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే
గత రెండు మూడు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా.. మార్చిలో ఇస్తారని భావించారు. అయితే ఏప్రిల్‌లో అయినా కందిపప్పు ఇస్తారని లబ్ధిదారులు అనుకున్నారు. ఈ నెలా సరిపడా కందిపప్పు రాలేదని ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఈ నెలలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఏప్రిల్ నెలకు కందిపప్పు సరఫరా కాలేదు. కందిపప్పును మే నెలలో వస్తుందని అంచనా వేస్తున్నారు. కందిపప్పు వచ్చే నెలలో సరఫరా అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తామంటున్నాు అధికారులు. ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు.