ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, వ్యాఖ్యలు చేస్తూ సరదాగా కనిపిస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ మాత్రం ఓ విషయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియమాలు, గతంలో స్పీకర్లు ఇచ్చిన రూలింగ్స్, సభా గౌరవాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు. అదే సమయంలో వారికి కీలక సూచనలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభకు హాజరవుతున్న ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించారు. అసెంబ్లీ ప్రాంగణం, లాబీల్లో మాత్రమే కాకుండా ఏకంగా సభలోనే ఫోన్లు మాట్లాడుతూ కనిపించడంపై రఘురామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు సభలో ఫోన్లు మాట్లాడుతున్నారని, అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని వారికి సూచించారు.అలాగే సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తమ ఫోన్లను సైలెంట్ లో పెట్టుకోవాలని రఘురామ మరో సూచన చేశారు.
వేగుళ్ల జోగేశ్వరరావు సూచన
అయితే, అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నియంత్రించేందుకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జామర్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్‌కు సలహా ఇచ్చారు. దీనిపై రఘురామ స్పందిస్తూ, “మన బలహీనతను జామర్లపైకి నెట్టొద్దు” అంటూ వ్యంగ్యంగా హితవు పలికారు.

మొబైల్ ఫోన్లు
సభలో నిబంధనల ప్రకారం క్రమశిక్షణ పాటించడం, సభ్యులు సభా గౌరవాన్ని కాపాడుకోవడం చాలా కీలకమని రఘురామకృష్ణంరాజు తన సూచనల ద్వారా స్పష్టంగా తెలియజేశారు.సభా సమావేశాల్లో ప్రజాప్రతినిధులు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం మర్యాద కాదని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై చర్చించే, ప్రజలకు మేలు చేసే విధంగా పాలనను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన వేదిక.
క్రమశిక్షణ
ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, తమ బాధ్యతను మరచిపోకుండా, సభా గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తిస్తేనే అసెంబ్లీ సమర్థంగా నడుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగం వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా క్రమశిక్షణ పాటిస్తే, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇప్పటికే సభ్యులకు ఫోన్లు తెచ్చుకొచ్చేందుకు అనుమతి ఉండదు.ఏపీ అసెంబ్లీలో కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.