అమెరికాలో జరిగిన క్వాడ్ దేశాల సదస్సు పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. కానీ, పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇది ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రిరిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు’ అని భారత్ పదేపదే చెబుతోంది. భారత్, పాక్ కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ విషయంలో అమెరికా మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న సందేశాన్నిచ్చే ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో భోజనానికి ఆహ్వానించారు. ఆ తర్వాత పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసింది. ఈ సంఘటనలు పాకిస్తాన్‌కు దగ్గరయ్యేందుకు అమెరికా ప్రయత్నిస్తోందనే సందేశాన్ని పంపాయి. గత వారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ – ఎస్‌సీవో (షాంఘై సహకార సంస్థ) సదస్సు సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నిరాకరించడం చర్చనీయమైంది. ”ఉగ్రవాదం గురించే భారత్ ఆందోళన. భారత్ ఆందోళనపై ఒక దేశానికి అభ్యంతరాలు ఉన్నాయని, అందువల్ల సంయుక్త ప్రకటన తుదిరూపం దాల్చలేదు” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

విదేశాంగ మంత్రుల సమావేశం
ఈ సదస్సు జరిగిన వారం రోజుల అనంతరం, అమెరికాలో జరిగిన క్వాడ్ దేశాల (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా) విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్వాడ్ దేశాలు ముక్తకంఠంతో ‘పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించాయి’. ఈ సమావేశానికి ముందు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ”ఉగ్రవాదం నుంచి తమ పౌరులను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది. ఆ హక్కును భారత్ వినియోగించుకుంటుంది. క్వాడ్‌లో మా భాగస్వామ్య దేశాలు దీనిని అర్థం చేసుకుని, అభినందిస్తాయని భావిస్తున్నా” అని జైశంకర్ అన్నారు.

జైశంకర్ ప్రకటన పాకిస్తాన్‌కు బలమైన, స్పష్టమైన సందేశంగా నిపుణులు చూస్తున్నారు.
భారత విదేశాంగ మంత్రి ప్రకటనపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “పాకిస్తాన్‌ను ఉద్దేశించి ట్రంప్, సెంట్‌కామ్ కమాండర్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ మంత్రి సమక్షంలో పాకిస్తాన్‌కు బలమైన, స్పష్టమైన, కచ్చితమైన సందేశాన్ని ఇచ్చారు” అని కన్వల్ సిబల్ ఆ పోస్టులో రాశారు.
పహల్గాం దాడి విషయంలో ..
సంస్థ నిర్మాణం, వాటి లక్ష్యాలు, భౌగోళిక రాజకీయ దృక్పథాల పరంగా క్వాడ్, ఎస్‌సీవో రెండూ భిన్నమైననవి. పహల్గాం దాడి విషయంలో రెండు సంస్థల వైఖరిలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. క్వాడ్ తమ సంయుక్త ప్రకటనలో, “క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా టెర్రరిజం అన్ని రూపాలను, హింసాత్మక తీవ్రవాదాన్ని క్వాడ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారంపై తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారు. అనేక మంది గాయపడ్డారు” అని పేర్కొంది.
‘బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాల’ గురించి ప్రస్తావించింది
షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి ప్రకటనను ‘పాకిస్తాన్ అనుకూల ప్రకటన’గా భారత్ పరిగణించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఎందుకంటే, అది ‘పహల్గాంలో దాడి’ గురించి ప్రస్తావించలేదు కానీ ‘బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాల’ గురించి ప్రస్తావించింది. బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాటానికి భారత్ మద్దతిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ వస్తోంది. ఎస్‌సీవోలో రష్యా కూడా సభ్యదేశం. భారత్ విషయంలో ఉమ్మడి ప్రకటనకు సంబంధించి రష్యా సమ్మతిపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఆసియాలో పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చైనా, రష్యా, మరో నాలుగు మధ్య ఆసియా దేశాలు కలిసి 2001లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాయి. 2017లో భారత్, పాకిస్తాన్ ఈ సంస్థలో భాగంగా మారాయి.
చైనా ఆధిపత్యానికి సవాల్
తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవలి క్వాడ్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. “తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో యథాతథ స్థితిని బలప్రయోగం ద్వారా మార్చాలనుకునే ఏకపక్ష ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని క్వాడ్ తన ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. చైనాను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లతో సంయుక్తంగా భారీ ఖనిజ వనరుల ప్రాజెక్టును అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని క్వాడ్ దేశాల సంయుక్త ప్రకటనలో “క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్”ను ప్రకటించారు. ఖనిజ సరఫరాలను భద్రపరచడం, బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం.
అణు కార్యకలాపాలపై క్వాడ్ తీవ్ర ఆందోళన
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అణు కార్యకలాపాలపై క్వాడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాకు సైనిక లేదా సాంకేతిక సాయం అందించవద్దని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఐదు దేశాల పర్యటన(జూలై 2 నుంచి 9 వరకు)లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. బ్రిక్స్ సమ్మిట్ – 2025 బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతోంది. బ్రిక్స్‌తో పాటు భారత్ క్వాడ్, ఎస్‌సీవో, జీ-20, బిమ్‌స్టెక్‌లో సభ్యదేశంగా ఉంది.
Read Also: Quad Foreign: దక్షిణ చైనా సముద్రంపై క్వాడ్ తీవ్ర ఆందోళన