రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన భారీ బడ్జెట్ పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer ). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ సంక్రాంతి సీజన్ కారణంగా వసూళ్లు బాగానే వస్తున్నట్లు నిర్మాతల ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడం తీవ్ర ఆందోళన కలిగించింది.
సోషల్ మీడియాలో ఈ సినిమా నెగటివ్ టాక్‌ను విస్తరించడమే కాకుండా, కథలోని కీలక అంశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ లీక్ చేయడం, స్పాయిలర్ రివ్యూలు పెడుతూ సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లీక్‌కు సంబంధించిన సోషల్ మీడియా లింకులు షేర్ చేసిన వ్యక్తులపై నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 45 మంది ఈ లీక్‌కు సంబంధం ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తూ, వారి సోషల్ మీడియా ఐడీలు, స్క్రీన్‌షాట్లు పోలీసులకు అందజేశారు.
ఈ లీక్ వల్ల స్థానిక టీవీ ఛానెల్‌లు, బస్సుల్లో సినిమా ప్రసారం కావడంపై నిర్మాత ఎస్‌కేఎన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “సినిమాను ఈ విధంగా ప్రసారం చేయడం ఎంతో మంది కృషికి నష్టం కలిగించే చర్య. హీరో, దర్శకుడు మాత్రమే కాదు, వేల మంది కష్టానికి ఈ లీక్ తీరని నష్టం చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ఇలాంటి ఘటనలు ఆర్థికంగా దెబ్బతీశాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా లీక్ సమస్యకు పరిష్కారం కనుగొనడం సినిమా పరిశ్రమకు అత్యంత అవసరం. సినిమాలపై ఇలాంటి దాడులు వందలాది కుటుంబాలకు జీవనాధారాన్ని దెబ్బతీస్తాయి. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్యలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.