‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు విదేశాలపై ప్రతీకార టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం పన్ను విధించిన ట్రంప్.. తాజాగా భారత్, చైనా సహా పలు దేశాలపై టారిఫ్ లు విధిస్తూ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆదేశాలు జారీ చేశారు. భారత్ పై 26 శాతం, చైనాపై 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికన్లకు వివిధ వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి.
అమెరికాలో ధరలు పెరగనున్న వస్తువులు ఇవే..

కార్లు ధరలు పెరగనున్నాయి
విదేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలతో పాటు విడిభాగాలపై ట్రంప్ 25 శాతం పన్ను విధించిన నేపథ్యంలో అమెరికాలో కార్ల ధరలు పెరగనున్నాయి. అమెరికాలో తయారయ్యే వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమపైనా టారిఫ్ ల ప్రభావం పడనుంది. అమెరికాలో తయారయ్యే పలు వాహనాలకు సంబంధించిన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. టారిఫ్ ల ప్రభావంతో వాటి ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా కార్ల ధరలు పెంచకతప్పని పరిస్థితిని కంపెనీలు ఎదుర్కొంటాయి. అంతిమంగా ట్రంప్ పన్నుల భారం అమెరికన్లపైనే పడనుంది. సగటున కార్ల ధరలు 2,500 డాలర్ల నుంచి 20 వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్నుల ప్రభావం వాహనరంగంపైనే అధికంగా ఉండనుందని వారు తెలిపారు.
మద్యం, కాఫీ ధరలు పెరగనున్నాయి
ప్రపంచంలో అత్యధికంగా కాఫీ దిగుమతులు చేసుకునే దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి కాఫీ గింజలు దిగుమతవుతాయి. మొత్తం దిగుమతులలో బ్రెజిల్ వాటా 35 శాతం కాగా కొలంబియా వాటా 27 శాతం. అయితే, ఈ రెండు దేశాలపై ట్రంప్ 10 శాతం ప్రతీకార టారిఫ్ లు విధించారు. దీంతో కాఫీ గింజల ధరలు పెరగనున్నాయి. ఇక మద్యం విషయానికి వస్తే.. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే వైన్ పై 200 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇప్పటి వరకు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ 200 శాతం పన్ను విధిస్తే అమెరికాలో ఫ్రెంచ్ వైన్ మరింత ఖరీదుగా మారనుంది.
దుస్తులు, షూస్ కూడా ..
అమెరికాలో అమ్ముడయ్యే వస్త్రాలు, షూలలో చాలావరకు చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ ల నుంచే దిగుమతవుతాయి. చైనాపై 34 శాతం, వియత్నాంపై 46 శాతం, బంగ్లాదేశ్ పై 37 శాతం ట్రంప్ టారిఫ్ విధించారు. దీంతో అమెరికన్ల దుస్తులు, షూస్ ల ధరలు పెరగనున్నాయి.
అవకాడో ధరలు పెరిగే అవకాశం
అవకాడో ఉత్పత్తికి మెక్సికో చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి వాతావరణం ఈ ఫ్రూట్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అమెరికాకు అవకాడో ఎగుమతి అవుతుంది. అమెరికాలో లభించే అవకాడోలలో 89 శాతం మెక్సికో నుంచి వచ్చినవే. మెక్సికోపై ప్రతీకార పన్ను విధించడం జరిగితే అవకాడో ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంధన ధరలు పెరగనున్నాయి
అమెరికాలోకి దిగుమతయ్యే ఇంధన వనరుల్లో మెజారిటీ వాటా కెనడాదే.. దాదాపు 69 శాతం చమురు కెనడా నుంచే అమెరికా దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ కెనడాపై 10 శాతం టారిఫ్ లు విధించడంతో అమెరికాలో ఇంధన ధరలు పెరగనున్నాయి.