భార్య పోర్న్ వీడియోలకు బానిసగా మారిందనే కారణంతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు, పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని, హస్తమైధునం హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. కింది కోర్టు తన విడాకుల అభ్యర్ధనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. తన భార్య పోర్న్ వీడియోలను చూస్తూ హస్తమైధునానికి బానిసైందని అతడు ఆరోపించాడు.

అప్పీల్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
అతడి అప్పీల్‌ను తోసిపుచ్చిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమల ధర్మాసనం.. ‘స్వీయ ఆనందం నిషేధిత ఫలం కాదు’ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ‘పురుషులలో హస్తప్రయోగం సార్వత్రికమైందని అంగీకరించినప్పుడు ఈ విషయంలో స్త్రీలకు కళంకాన్ని ఆపాదించడం తగదు’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
దీనిని నైతికంగా సమర్దించలేం కానీ..
అయితే, పోర్న్ వీడియోలకు బానిసగా మారడం మాత్రం చెడ్డ అలవాటే.. దీనిని నైతికంగా సమర్దించలేం కానీ, ఈ కారణంతో విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు, భార్య తన జీవిత భాగస్వామిని బలవంతం చేయకుండా ప్రైవేట్‌గా పోర్న్ చూసినంత మాత్రాన అది వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ‘పోర్న్ వీడియోలు చూడటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు… కానీ, జీవిత భాగస్వామితో క్రూరంగా ప్రవర్తించినట్లు కాదు
వేరొకరితో లైంగిక సంబంధం కొనసాగిస్తే..
‘వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కాకుండా వేరొకరితో లైంగిక సంబంధం కొనసాగిస్తే ఆ కారణంతో విడాకులను మంజూరు చేయవచ్చు. అయితే, స్వీయ ఆనందంలో మునిగిపోవడం వివాహాన్ని రద్దు చేయడానికి కారణం కాకూడదు.. ఎంత ఊహకు అందనంత దూరంలో ఉన్నా, క్రూరత్వంగా ఆపాదించలేం.. ’ అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.