ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిమానం చాటుకున్నారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి తన అభిప్రాయాలు చెప్పి మద్దతు తెలిపి వచ్చిన ఉండవల్లి.. ఇప్పుడు మరోసారి ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి పవనే దిక్కు అంటూ ఉండవల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఓవైపు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, విపక్ష నేత జగన్ కంటే పవనే ఆశాజ్యోతి అని ఉండవల్లి చెప్పడం చర్చనీయాంశమవుతోంది.
ఆశాజ్యోతిగా పవన్
ఏపీకి పవన్ ఆశాజ్యోతిగా భావిస్తున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ వెల్లడించారు. చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన హామీలను..కేంద్రం నుంచి పవన్‌కల్యాణ్ సాధించాలని ఉండవల్లి సూచించారు. కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించాలని అడిగారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశాన్ని ప్రస్తావించాలంటూ పవన్ కు ఆయన సూచించారు. ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్రం ప్రస్తుతం మన రాష్ట్రం మీద ఆధారపడి నడుస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇదే అదును.. ఇప్పుడే డిమాండ్స్ సాధించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చట్ట ప్రకారం వెళుతుందనే నమ్మకం తనకుందని, కానీ విభజన సమయంలో కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు.

విభజన హామీ లో 75 వేల 50 కోట్లు
ఇది మంచి సమయం అని, చంద్రబాబు వ్యూహాలు ఎవ్వరికీ ఉండవన్నారు. అయితే ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఆయన తలచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాదనే నమ్మకం తనకుందన్నారు. ఇదే అంశంపై పవన్ కు ఓ లేఖ కూడా రాసినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. విభజన హామీ లో 75 వేల 50 కోట్లు రాష్ట్రానికి రావాలని, దీనిపై పార్లమెంటు లో ప్రస్తావించమని కోరినట్లు తెలిపారు. . కేంద్రంతో పవన్ కళ్యాణ్ మాట్లాడితే పరిష్కారం వుంటుందన్నారు. పవన్ కళ్యాణ్ సాధిస్తారనే నమ్మకం వుందన్నారు. దీని కోసం లోకసభకు ఆయన నోటీసు ఇవ్వాలని, నోటీసు ఎలా ఇవ్వాలో కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
పార్లమెంటు లో చర్చించాలి
అమిత్ షా దీనిపై చర్చించదానికి సిద్ధం అని చాలా సార్లు చెప్పారని,రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటు లో చర్చించే నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి పవన్ ను కోరారు. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం చేసిన రోజు ఇదే అన్నారు. విభజన హామీల్ల చెప్పిన విధంగా లక్షా 42 వేల 600కోట్లు ఇంకా పంచలేదన్నారు. 42శాతం వాటా తెలంగాణకు వెళుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలు విభజించ లేదని తెలిపారు. అయినా తనకు ఎందుకో పవన్ కళ్యాణ్ మీద ఆశ వుందన్నారు.