హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రజలలో తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు (Patancheruvu) సమీపంలో ఉన్న పాశమైలారంలోని సిగాచి కెమికల్స్‌లో భారీ పేలుడు సంబంధించింది. రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 100 మీటర్ల వరకు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు.ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 20మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుల్ని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కంపెనీలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు తీవ్రతకు రియాక్టర్ (Reactor) ఉన్న భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనానికి బీటలు వచ్చాయంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

కంపెనీ దగ్గరకు
ఫ్యాక్టరీలో పేలుడు తర్వాత మంటలు చెలరేగగా కార్మికులు పరుగులు తీశారు. కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు ప్రమాదం జరిగిన కంపెనీ (Company) దగ్గరకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా పఠాన్‌చెరు సమీపంలోని ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగాయి.పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Read Also: Swetcha: యాంకర్ స్వేచ్ఛతో సంబంధంపై లేఖ విడుదల చేసిన పూర్ణ చందర్