ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో… దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ 27 ఏళ్ల కల ఈరోజు నెరవేరబోతోంది. మరోవైపు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సీఎం రేసులో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ… చివరిగా పర్వేశ్ వర్మ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ను పర్వేశ్ వర్మ మట్టి కరిపించారు. దీంతో, ఆయన పేరు బీజేపీ శ్రేణుల్లో మారుమోగుతోంది. కాసేపటి క్రితం అమిత్ షా నుంచి ఆయనకు పిలుపు వెళ్లడంతో… తన నివాసం నుంచి ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కుమారుడు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తర్వాతి ఏడాదే పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు.