కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్(Pakistan) మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పాకిస్తాన్‌తో దాడుల సందర్భంగా భారత్(Bharath) ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్న పాక్ మీడియా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో వారి వాదనలకు బలం చేకూర్చేలా మరింత ప్రచారం ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్ దాడుల గురించి పాక్ ఆర్మీకి ముందే సమాచారం ఇచ్చారని జైశంకర్ చేసినట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. తీవ్ర దుమారానికి కారణం అయ్యారు.
పాకిస్తాన్ మీడియా భారీగా ప్రచారం
ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పాకిస్తాన్ మీడియా బాగా హైలెట్ చేస్తూ.. సంబరపడిపోతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా భారీగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ఫెయిల్ అయిందని.. ఈ దాడుల్లో భారత్‌ను తాము ఓడించామని ఆ దేశం ప్రచారం చేసుకుంటోంది. భారత సైన్యం చేసిన దాడుల్లో ఎయిర్ బేస్ ధ్వంసం అయినా.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కోల్పోయినా పాక్ సైన్యం, ప్రభుత్వం మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కు చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని.. మరీ ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ఇప్పటికే అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది.
అయితే ఓ వైపు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తోడవడంతో ఇప్పుడు పాక్ మీడియా మరింత రెచ్చిపోతోంది.