తెలుగు యువ నటులు బాలు, షిన్నోవా, సాన్విత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒక బృందావనం’. ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశి నెక్కంటి వంటి పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సత్య బొత్స(Satya Botsa) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీర్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతోంది. తాజాగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో అనేది రివ్యూలో చూద్దాం.
కథ
రాజా విక్రమ్ (బాలు) ఒక ఈవెంట్ కంపెనీలో కెమెరామెన్‌గా పనిచేస్తూ, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఎలాగైనా అమెరికా వెళ్లి బాగా సంపాదించాలనేది అతని కల. మరోవైపు, మహి (షిన్నోవా)అమ్మ చేయాలనుకున్న డాక్యుమెంటరీ పూర్తి చేయాలనే లక్ష్యంతో, ఇంట్లో పెళ్లి వద్దని చెప్పి బయటకు వచ్చేస్తుంది. నైనికా (సాన్విత) అనే చిన్నారి అనాథాశ్రమంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్‌కి జోసెఫ్ (శుభలేఖ సుధాకర్) పేరు మీద ఆమెకు బహుమతులు వస్తూ ఉంటాయి. దీనితో ఎప్పటికైనా జోసెఫ్‌ను కలవాలని, తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని నైనిక కోరుకుంటుంది.రాజా తన ప్రేమలో విఫలమై, బ్రేకప్‌తో బాధపడుతున్న సమయంలో, అతని కెమెరా నైపుణ్యాలు నచ్చి మహి తన డాక్యుమెంటరీకి కెమెరామెన్‌గా పని చేయమని అడుగుతుంది. అవసరాలకు డబ్బు కావాలి కాబట్టి రాజా వెంటనే ఒప్పుకుంటాడు. అలా రాజా, మహి ఒక డాక్యుమెంటరీ కోసం కలిసి పనిచేస్తారు. ఈ క్రమంలోనే వారు నైనికను కలుసుకుంటారు. నైనిక జోసెఫ్‌ను కలవాలని ఆశ్రమం నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆమెను జోసెఫ్ వద్దకు తీసుకెళ్తామని రాజా, మహి హామీ ఇవ్వడంతో, నైనిక వారి డాక్యుమెంటరీ వీడియోలో భాగం కావడానికి ఒప్పుకుంటుంది. అసలు మహి డాక్యుమెంటరీ(Mahi Documentary) దేని గురించి? రాజా అమెరికాకు వెళ్తాడా? జోసెఫ్ ఎవరు? ఆ పాపకు ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు? మహి పెళ్లి జరుగుతుందా? జోసెఫ్ కోసం రాజా, మహి, నైనిక చేసే ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

కథనం
ఒక బృందావనం సినిమా ఒక హృదయాన్ని హత్తుకునే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు మంచి సోల్ ఉన్న సినిమాలు వస్తుంటాయి, ఈ సినిమా కూడా ఆ కోవలోకి చెందిందే. మొదటి భాగం అంతా రాజా, మహి, నైనిక పాత్రల పరిచయం, రాజా బ్రేకప్ స్టోరీ, మహి రాజా వెనక డాక్యుమెంటరీ కోసం తిరగడం, డాక్యుమెంటరీ షూటింగ్(Shooting)తో కాస్త నిదానంగా సాగుతుంది. ఒక మంచి ఎమోషన్ తో ఇంటర్వెల్ వస్తుంది. రెండో భాగంలో జోసెఫ్ ని వెతుక్కుంటూ రాజా, మహి, నైనిక ప్రయాణం ఎలా సాగింది, నైనిక ఎవరు అనే అంశాలపై మంచి ఫీల్ తో సాగుతుంది. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం,చాలా ఎమోషన్ గా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా కాస్త సాగదీసినా ఒక మంచి ఫీల్ ఇచ్చేలా కథని నడిపించారు. ప్రేమ సన్నివేశాలు మాత్రం రెగ్యులర్ గానే అనిపిస్తాయి, చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసేసాం అనిపిస్తుంది. మహిళా సాధికారత గురించి కూడా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Also: Actor: అరుంధతి సినిమాలో అనుష్క భాగం అయ్యారు: బెల్లంకొండ శ్రీనివాస్