బీహార్ రాజకీయాల్లో మరో సరికొత్త మలుపు తిరిగింది కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత అశ్వినీ కుమార్ చౌబే చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ఉప ప్రధాని పదవిలో చూడాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.ఎన్డీయే కూటమికి నితీశ్ కుమార్ చేసిన సేవలు ఎన్నెన్నో. ఆయనే కూటమికి స్థిరతను ఇచ్చారు. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన అనుభవం అమోఘం.అలాంటి నేతకు గౌరవంగా ఉప ప్రధాని స్థానం ఇవ్వాలన్నదే చౌబే అభిప్రాయం. ఇది బీజేపీ అధికారిక నోటినొచ్చిన మాట కాకపోయినా, ఆలోచన మాత్రం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీయడంతో అశ్వినీ కుమార్ ఒక స్పష్టత ఇచ్చారు.ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని తెలిపారు. అయినా ఒకవేళ ఇది జరిగితే, బీహార్ నుంచి ఉప ప్రధాని అయ్యే రెండో వ్యక్తిగా నితీశ్ కుమార్ నిలిచేవారని అన్నారు.ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.

నితీశ్ మరోసారి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అయితే బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిగా నితీశ్‌ను ఆమోదించే అవకాశం తక్కువే అని ప్రచారం జరుగుతోంది.ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బీజేపీ, నితీశ్ కుమార్ మధ్య దూరం పెరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. అశ్వినీ వ్యాఖ్యలు చూస్తే, నితీశ్‌కు “సామరస్యంగా గౌరవం” కల్పించాలన్న భావన బీజేపీ నేతలలోనూ ఉండవచ్చని అర్థమవుతోంది.ఈ పరిణామాలు చూస్తుంటే, బీహార్ రాజకీయ రంగంలో నూతన సమీకరణాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నితీశ్ ఉప ప్రధాని కావడమా? లేక మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో రాణించడమా? వేచి చూడాలి మరి.