బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly elections) దగ్గర పడుతుండడంతో,ఇండియా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఊపు తెచ్చింది. మంగళవారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ “బీహార్ కా తేజస్వి ప్రణ్” (తేజస్వి సంకల్పం) పేరుతో 32 పేజీల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడమే ప్రధాన హామీగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read Also: Chennai Crime: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి
తేజస్వి మాట్లాడుతూ, తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రోజుల్లోనే రాష్ట్రంలో ఉద్యోగ భద్రత చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. అదేవిధంగా 20 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని చెప్పారు. “ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడమే మా ప్రధాన లక్ష్యం.
ఈ సంకల్పాన్ని నెరవేర్చడం ద్వారా బీహార్ యువతకు భవిష్యత్తు నిర్మించడమే మా ధ్యేయం” అని తేజస్వి స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని, ‘జీవికా దీదీ’లను సైతం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ. 30,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చారు.
వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టాన్ని బీహార్‌లో అమలు చేయకుండా అడ్డుకుంటామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.

బౌద్ధుల మనోభావాలకు అనుగుణంగా బోధ్‌గయ ఆలయాల నిర్వహణను బౌద్ధ సమాజానికే అప్పగిస్తామని పేర్కొన్నారు.మరో కీలక హామీగా, రాష్ట్రంలో తాటి కల్లుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని తేజస్వి ప్రకటించారు. 2016 నుంచి అమల్లో ఉన్న మద్యపాన నిషేధ చట్టాన్ని సమీక్షిస్తామన్నారు.
ఎన్డీఏకు బీహార్ అభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదు
ఈ చట్టం కింద అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న దళితులు, పేదలకు తక్షణమే ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా కల్లు గీతనే నమ్ముకున్న వర్గాలకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా అధికార ఎన్డీయే కూటమిపై తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“ఎన్డీఏకు బీహార్ అభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదు. అందుకే ఇంతవరకు మేనిఫెస్టో కూడా విడుదల చేయలేదు. బీజేపీ నేతలు, అవినీతి అధికారులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ను కీలుబొమ్మగా మార్చారు.
నితీశ్ మళ్లీ సీఎం అభ్యర్థి కారని
నితీశ్ మళ్లీ సీఎం అభ్యర్థి కారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇప్పటికే స్పష్టం చేశారు” అని ఆరోపించారు. తమ మేనిఫెస్టో బీహార్ అభివృద్ధికి ఒక రోడ్‌మ్యాప్ అని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీఐపీ పార్టీ అధినేత ముఖేశ్ సహానీ తదితర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని నేతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: