న్యూజిలాండ్ ఎంపీ లారా మెక్‌క్లూర్ ఇటీవల పార్లమెంట్‌లో తనపై రూపొందించిన డీప్‌ఫేక్ నగ్న చిత్రాన్ని ప్రదర్శించి, ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేశారు.అయితే ఈ నగ్న ఫోటోను కేవలం 5 నిమిషాల లోపే రూపొందించినట్లు వెల్లడించారు. డీప్‌ఫేక్‌ల వల్ల కలిగే నష్టాలను వివరించిన లారా మెక్‌క్లూర్ ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ సంచలనం సృష్టిస్తోంది. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లోకి శరవేగంగా ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది.
ఏఐ డీప్‌ఫేక్
ఇక ఏఐ వల్ల చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయనే భయాలు నెలకొంటున్న వేళ కొన్ని సంస్థలు ఇప్పటికే లేఆఫ్‌లు ప్రకటించి వేలాది మంది ఉద్యోగులను నడిరోడ్డున పడేస్తున్నాయి. ఇది ఒక నష్టం అయితే మరో కోలుకోలేని నష్టం ఏంటంటే ఏఐ డీప్‌ఫేక్‌తో నగ్న ఫోటోలు, వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో, డార్క్‌వెబ్‌లో, అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తుండటం పెను సవాలుగా మారింది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఏఐ డీప్‌ఫేక్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల కలిగే ప్రమాదాలను ప్రపంచదేశాలకు వెల్లడించేందుకు న్యూజిలాండ్ ఎంపీ లారా మెక్‌క్లూర్(Laura McClure)ఈ వినూత్న ఆలోచన చేశారు.
లారా మెక్‌క్లూర్
ఆ ఫోటోను పార్లమెంటులో చూపించిన లారా మెక్‌క్లూర్ ఆ ఫోటో తన నగ్న చిత్రమని పేర్కొంటూనే అది నిజమైంది కాదని స్పష్టం చేశారు. ఇలా నిజమేదో, అబద్ధం ఏదో గుర్తించలేకుండా ఉండే నకిలీ ఫోటోలను ఎంత ఈజీగా రూపొందించవచ్చో ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఇది చాలా భయకరమైందని ఆ ఫోటో కల్పితమైందని తెలిసినప్పటికీ దాని వల్ల కలిగే మెంటల్ టెన్షన్ గురించి లారా మెక్‌క్లూర్ పార్లమెంటులో ప్రస్తావించారు.
దుర్వినియోగం
లారా మెక్‌క్లూర్ ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్(Instagram account)లో కూడా షేర్ చేశారు. తాను పార్లమెంట్‌లో తన ఏఐ నగ్న డీప్‌ఫేక్ ఫోటోను చూపించానని అది నిజమైన ఫోటో లాగా సులభంగా ఎలా తయారు చేయవచ్చో చూపించడానికి మాత్రమే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సమస్య టెక్నాలజీ వల్ల కాదని అది ప్రజలను దుర్వినియోగం చేయడానికి ఎలా ఉపయోగించబడుతుంది అనేది తెలిపేందుకేనని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా చట్టాలు మారాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
నిజమైన ఫోటోల
అనుమతి లేకుండా ప్రైవేటు ఫోటోలను షేర్ చేసుకోవడాని నిషేధించేందుకు చేసే ప్రస్తుత చట్టాల్లో డీప్‌ఫేక్‌లను చేర్చడానికి చట్టపరమైన సవరణలను ఆమె సమర్థిస్తున్నారు. డీప్‌ఫేక్(Deepfake)లు నిజమైన ఫోటోల కంటే ఎక్కువ హానికరం కావచ్చని అవి సంబంధిత వ్యక్తుల గౌరవాన్ని, పరువును తీసే విధంగా ఉంటాయని లారా మెక్‌క్లూర్ పార్లమెంటులో గట్టిగా వాదించారు.