ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్(Iran)తో జరుగుతున్న యుద్ధం కారణంగా తన కుమారుడి వివాహం రెండోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా చెబుతూనే.. నెతన్యాహు దీన్ని తాను యుద్ధం కోసం చేస్తున్న వ్యక్తిగత త్యాగంగా అభివర్ణించారు. పెళ్లి ఆగిరపోవడంతో తన భార్య, కాబోయే కోడులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారని, వారు నిజంగా హీరోలంటూ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శల వస్తున్నాయి. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన వేలాదిమంది పౌరులు, సైనికుల కుటుంబాల బాధతో పోలిస్తే.. పెళ్లి వాయిదా పడడం పెద్ద విషయమేమీ కాదని, దీనికే దేశం కోం తామేదో పెద్ద త్యాగం చేస్తున్నట్లుగా చెప్పాల్సిన అవసరం లేదని విపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.

ఇజ్రాయెలీ సైనికుల ప్రాణాలు త్యాగం
ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అవి కాస్తా ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో అనేక మంది ఇజ్రాయెలీ సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వేలాది మంది పౌరులు తమ ఇళ్లను, ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. ఆదేశ ప్రధాని బెంజిమెన్(Benjimen Netanyahu) నెతన్యాహు తన కుమారుడి వివాహం వాయిదా పడటాన్ని ‘త్యాగంగా’ అభివర్ణించారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది.
సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా నెతన్యాహు కుమారుడు అవ్నెర్ వివాహం మొదట ఇరాన్-ఇజ్రాయెల్(Israel-Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో రెండోసారి కూడా వాయిదా పడినట్లు నెతన్యాహు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రస్తావించి.. దానిని యుద్ధం కోసం తన కుటుంబం చేస్తున్న వ్యక్తిగత త్యాగంగా పేర్కొన్నారు. పెళ్లి వాయిదా పడడంతో.. ముఖ్యంగా తన భార్య, కాబోయే కోడలు విపరీతంగా బాధ పడుతున్నారని అన్నారు. వాళ్లే నిజమైన హీరోలని.. దేశం కోసం వాళ్లు కూడా వాయిదాకు అంగీకరించారని చెప్పారు. అయితే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయగానే.. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.