రెండు రోజుల కింద టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధులు దావోస్ వేదికగా హైదరాబాదులో తమ కార్యకలాపాలను రానున్న నెలలో విస్తరించటం ద్వారా కొత్తగా 5000 ఉద్యోగాల కల్పన జరగనుందని ప్రకటించారు. దీనిని మరచిపోకమునుపే తాజాగా విప్రో కూడా శుభవార్త చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్, బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ కంపెనీలకు ప్రస్తుతం బెస్ట్ డెస్డినేషన్ కింద భారతదేశంలోని హైదరాబాద్ కొనసాగుతోంది. అనేక జీసీసీలు కూడా తమ కెపాసిటీ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణను ఉత్తమ ఎంపికల్లో ఒకటిగా ఇప్పటికే కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో భారతీయ టాప్ టెక్ కంపెనీలు కూడా దీనిని లెవరేజ్ చేసుకునేందుకు విస్తరణ బాట పడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే టాప్-5 భారతీయ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తన హైదరాబాదు క్యాంపస్ విస్తరించాలనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేసే ఈ సెంటర్ ద్వారా దాదాపు 5000 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. వాస్తవానికి దావోస్ వేదికగా జరుగుతున్న వ్యాపార చర్చల్లో పాల్గొన్న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో చర్చల తర్వాత దీనిని ప్రకటించారు. ప్రేమ్‌జీ ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డీ హర్షం వ్యక్తం చేశారు. దేశీయ ఐటీ కంపెనీలు విస్తరణకు హైదరాబాదును అనుకూలమైన నగరంగా ఎంపిక చేయటంతో సాంకేతిక రంగంలో తెలంగాణ వేగంగా వృద్ధిని సాధించటంతో పాటు స్థానిక యువతకు మెరుగైవ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విప్రో ప్రకటించిన కొత్త సెంటర్ నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి రావటానికి కనీసం 2-3 ఏళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.