2026లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రంలో తరచూ మహిళలపై చోటు చేసుకుంటోన్న దాడులు, వారికి సరైన భద్రత లభించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత విషయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 2026లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని విజయ్ మహిళా లోకానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు విజయ్.

భద్రత లేనప్పుడు సంతోషంగా వుండలేం
తల్లి, చెల్లి, స్నేహితులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని అన్నారు. మహిళలకు రక్షణ ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది కదా? అని ప్రశ్నించారు. భద్రత లేనప్పుడు, అభద్రతా భావం ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలమా? అని వ్యాఖ్యానించారు. ఇదే విషయం గురించి రాష్ట్రంలోని ప్రతి మహిళలు ఆందోళన చెందుతున్నారని, భద్రతపై ఆలోచిస్తోన్నారనే విషయం తనకు అర్థమౌతోందని విజయ్ వ్యాఖ్యానించారు. మనమందరం కలిసి ఎన్నుకున్న డీఎంకే ప్రభుత్వం నిరాశపరిచిందని పేర్కొన్నారు.
మార్పును తీసుకుని రావాలని
అందుకే మరోసారి మనందరం కలిసి మార్పును తీసుకుని రావాలని విజయ్ పిలుపునిచ్చారు. ప్రతిదీ మారగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, 2026లో జరిగే ఎన్నికల సందర్భంగా మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన డీఎంకే ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని విజ్ఞప్తి చేశారు. మహిళలందరికీ మరోసారి హామీ ఇస్తోన్నానని, కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా ఎప్పుడూ అండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2026 ఎన్నికలే లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారని విశ్లేషిస్తున్నారు.