జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం రోజు మారణ హోమం సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.ఫుడ్‌స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి.
త్వరలోనే
ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన ముగియకముందే ఇండియాకి తిరిగొచ్చారు. అధికారులతో అత్యసవర సమావేశాలు నిర్వహించి మరీ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే నిందితులను సైతం త్వరలోనే పట్టుకోవాలని అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఈ ఘటనపై నోరు విప్పలేదు. కానీ ఉగ్రదాడి జరిగిన రెండ్రోజుల తర్వాత తొలిసారి స్పందించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ప్రసంగానికి ముందు పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. నిమిషం పాటు అక్కడున్న వారంతా మౌనం పాటించారు.

మోదీ మాట్లాడుతూ
ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామన్నారు. అలాగే ఈ దాడి వల్ల అనేక మంది బిడ్డలు, భర్తలను కోల్పోయారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని ఇది కేవలం పర్యటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, భారత దేశంపై జరిగిన దాడని అభివర్ణించారు. అలాగే ఈ దాడికి పాల్పడ్డ వారితో పాటు, మద్దతు ఇచ్చిన వారందరినీ ట్రాక్ చేసి మరీ పట్టుకుంటామని శిక్షిస్తామని భారతీయులందరికీ హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. వీరికి పడబోయే శిక్ష ఎవరి ఊహకు కూడా అందదని పేర్కొన్నారు.బాధితులు అందరికీ న్యాయం చేసేందుకు అన్ని రకాలు ప్రయత్నిస్తామని , ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని మోదీ వివరించారు. అలాగే ఉగ్రమూకల వెన్నుమూకను 140 కోట్ల మంది భారతీయులు కలిసి విరిచేస్తారని గట్టిగా హెచ్చరించారు.
Read Also: Pahalgam Attack: వెనుతిరిగి వస్తున్న జమ్మూ కశ్మీర్ పర్యటకులు