బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు పొరపాటున కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. విమాన ప్రయాణంలో ఇలాంటి సంఘటన జరగడంతో భద్రతా సమస్య తలెత్తుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్‌ను టాయిలెట్ తలుపు అనుకుని తెరవడానికి ప్రయత్నించాడని, ఎటువంటి భద్రతా సమస్య తలెత్తలేదని స్పష్టంచేశారు. విమాన సిబ్బంది సమయానికి జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని వివరించారు. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా సురక్షితంగానే ఉందని కంపెనీ భరోసా ఇచ్చింది.

అయితే, నియమ నిబంధనల ప్రకారం ఆ ప్రయాణికుడిని CISF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉన్నందున విచారణ జరపనున్నట్లు సమాచారం. విమాన ప్రయాణాల్లో కాక్‌పిట్ భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం కావడంతో, ఇలాంటి చిన్నపాటి తప్పిదాలను కూడా అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఈ ఘటన, ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.