ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తాజాగా ఆమెకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను ప్రధాని తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇందులో దీపిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దీపికా పదుకొణె మాట్లాడుతూ
“స్కూల్ చదువు నుంచి క్రీడల వైపు ఆ తర్వాత మోడలింగ్ అక్కడి నుంచి సినిమాల వైపు ఇలా నా జీవితంలో చాలా మార్పులు చూశా. ఆ సమయంలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూనే వచ్చా. 2014 వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఒకసారి ఉన్నట్టుండి కుప్పకూలిపోయా. అప్పుడే నేను కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ముంబయిలో ఒంటరిగా ఉండటం వల్ల ఈ సమస్యను చాలాకాలం పాటు ఎవరికీ చెప్పలేదు. మా అమ్మ ముంబయికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెను పట్టుకుని బాగా ఏడ్చేశా. ఆ రోజు తొలిసారి నా బాధను అమ్మతో పంచుకున్నా. ‘నిస్సహాయ స్థితిలో ఉన్నా. నాకు జీవితంపై ఆశ లేదు. బతకాలని లేదు’ అని అమ్మకు చెప్పా. అప్పుడు ఆమె నన్ను మానసిక వైద్య నిపుణుడి వద్దకు వెళ్లమని సూచించింది” అని దీపిక ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు అనేవి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కొనేవే అని,వాటి గురించి భయపడొద్దని సూచించారు.సమస్యను పంచుకుంటేనే మనలోని భారం తగ్గిపోతుందని తెలిపారు. సమస్యను దాచిపెట్టి బాధపడితే వచ్చేది ఏమీ లేదని, ధైర్యంగా బయటకు చెప్పాలని దీపిక చెప్పుకొచ్చారు.
విద్యార్థులకు దీపికా పదుకొణె సూచించిన ముఖ్యమైన అంశాలు:
- ఆందోళనను జయించండి: ఒత్తిడి, ఆందోళన మరియు కుంగుబాటును జయించేందుకు ధైర్యం చూపండి.
- సహాయం తీసుకోండి: అవసరమైనప్పుడు మానసిక వైద్య నిపుణుల నుంచి సహాయం పొందండి.
- పంచుకోండి: మీ బాధను కుటుంబం లేదా మిత్రులతో పంచుకోండి, అది మీకు మానసిక శాంతిని ఇచ్చే దారిని తీసుకురావచ్చు.
- దేశంలో మానసిక ఆరోగ్యం ప్రతికూల అంశాన్నే కలిగి ఉంటుందని దీపిక అన్నారు. ‘ఎన్నో సమస్యలతో పోరాడుతున్న వారు మన చుట్టూనే ఉంటారు. కానీ, ఆ విషయం మనకు తెలియదు. ఎందుకంటే వాళ్లు బయటకు సంతోషంగా, సాధారణంగా కనిపిస్తారు. దాని గురించి ఎవరూ బయటకు మాట్లాడరు. నేను నా సమస్యను బయటకు చెప్పిన వెంటనే మనసు చాలా తేలికగా అనిపించింది. ఆందోళన, ఒత్తిడి, నిరాశ అనేవి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కొనేవే. ఇవి మనిషిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే వాటి గురించి భయపడొద్దు. పంచుకుంటేనే మనలోని భారం దిగిపోతుంది. సమస్యను అణచిపెట్టుకొని బాధపడొద్దు. ధైర్యంగా బయటకు చెప్పాలి’ అని దీపిక విద్యార్థులకు సూచించారు.