జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలుపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా, ఈ విధానంలో భాగంగా హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషలతో కూడిన త్రిభాషా సూత్రాన్ని కేంద్రం బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ వివాదం నేపథ్యంలో, ప్రముఖ తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. ఎన్‌ఈపీని రాష్ట్రాలపై బలవంతంగా అమలు చేయడం సరికాదని, ఇది తమిళ భాష గౌరవాన్ని తగ్గించే ప్రయత్నమని ఆమె అభిప్రాయపడ్డారు. తాను తమిళ సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రభుత్వ వాదన
ఎన్‌ఈపీ అమలుతో ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం అంటోంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుందన్నది తమిళ ప్రజల ప్రధాన ఆరోపణ. భవిష్యత్తులో తమిళ భాష ఉనికే ప్రశ్నార్థకమవుతుందని, విద్యా విధానం పేరుతో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టాలిన్ విమర్శలు
జాతీయ విద్యా విధానం అమలు చేస్తే భవిష్యత్తులో తమిళ భాష ప్రమాదంలో పడిపోతుందని, దాని ఉనికే ప్రశ్నార్థకమవుతుందని స్టాలిన్ అంటున్నారు.

త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. జాతీయ విద్యా విధానం (ఎన్పీఈ) ద్వారా రాష్ట్రంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపిస్తుంది. దీనికి నిరసనగా ‘ఎక్స్’ లో ‘గెట్ ఔట్ మోదీ’ అంటూ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ‘గెట్ ఔట్ స్టాలిన్’ అంటూ ప్రచారం అందుకున్నారు. ఈ విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్పీపీ అమలుకు ఒప్పుకుంటే నిధులను విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.
స్టాలిన్ వ్యాఖ్యలు
సీఎం స్టాలిన్ రూ. 10వేల కోట్లిచ్చినా ఆ విద్యావిధానాన్ని తాము అమలుపరిచే ప్రసక్తేలేదని స్టాలిన్ ప్రకటించారు. కడలూరు జిల్లాలో ‘తల్లిదండ్రులను గౌరవిద్దాం’ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ జాతీయ విద్యావిధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమగ్ర శిక్షా అభియాన్ పథకం అమలుకు కేంద్రం తరఫున చెల్లించాల్సిన రూ.2152 కోట్ల నిధులను అకారణంగా నిలిపేశారని ఆరోపించారు. మోదీ సర్కారు నిర్వాకంతో ఆ పథకంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యత పెరిగిందని ప్రశంసిస్తూనే . తమిళనాడుకు రావాల్సిన ఎస్ఎస్ఏ నిధులను నిలిపేసిందని విమర్శించారు. జాతీయ విద్యా విధానాన్ని తాము ఒప్పుకోవడం లేదనే కారణంతో ఈ నిధులను ఇవ్వడానికి నిరాకరిస్తోందని మండిపడ్డారు.జాతీయ విద్యావిధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదన్న తమిళనాడు సీఎం.. రాష్ట్రంలో హిందీభాషను నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కానీ, భాషను నిర్బంధంగా అమలు చేయాలన్న ఆలోచననే దశాబ్దాల తరబడి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అటు, ప్రతిపక్ష అన్నాడీఎంకే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. హిందీని తమిళులపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది.