పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. జూలై 15న కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) తన నివాసం 10, జన్‌పథ్ లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ప్రధాన నేతలు హాజరుకాబోతున్నారు.
విపక్ష వ్యూహంపై చర్చ
ఈ సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్ర చర్చ జరగనుంది. బీహార్ ఓటర్ల జాబితా ఇన్టెన్సివ్ రివిజన్, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలను ఉభయ సభల్లో ఎలా ప్రస్తావించాలి అనే దానిపై స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. అధికార పార్టీకి గట్టి ప్రతిస్పందన ఇచ్చేలా కాంగ్రెస్ ఎంపీలకు మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాల పొడిగింపు – కీలక చట్టాలకు అవకాశం
ఈసారి వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. మొదట ఇది ఆగస్టు 12తో ముగుస్తుందని భావించగా, ఇప్పుడు మరో వారం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో లెజిస్లేటివ్ ఎజెండా విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించే చట్టంతో పాటు ఇతర కీలక బిల్లులను తీసుకురావాలని కేంద్రం భావిస్తుండటంతో, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో సభల్లో పాల్గొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Amaravathi : రూ.1000 కోట్లతో APలో BITS పిలానీ క్యాంపస్ – బిర్లా