18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఐపీఎల్ ట్రోఫీ(IPL Cup)ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయాన్ని ఆజ్ఞానంగా జరుపుకుంది. బెంగళూరు నగరం మొత్తం సంబరాల సందడిలో మునిగిపోయింది. కానీ ఆ ఆనందమే కొంతకాలానికే కన్నీటి మడుగుగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అధికారిక వేడుకలకు వేలాది మంది అభిమానులు తరలిరాగా, వారి ఉత్సాహం ఒక విషాద దృశ్యానికి దారితీసింది. ఒక్కసారిగా జనం ముందుకురావడం తో క్రమశిక్షణ లోపం, భద్రతా ఏర్పాట్ల లోపం తొక్కిసలాట(Stampede )కు దారితీసింది.
తొక్కిసలాట లో 11 మంది మృతి
ఈ ప్రమాదంలో 11 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. వారి కలలు ఆర్సీబీ ఆటగాళ్లను కంటికీ చూపించుకోవాలన్న మక్కువలోనే ముగిసిపోయాయి. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారు ఎదుర్కొన్న భయానక దృశ్యాలు మానసికంగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వ సత్కార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో ఇంతటి అంచనాకు మించిన జనసంచారం ఉండబోతుందని అధికారులు ముందుగానే ఊహించకపోవడం ఘోరమైన విఫలతగా నిలిచింది.
యాజమాన్యం లోపమే ఈ ఘటన కు కారణమా..?
ఇప్పడు ప్రధానంగా బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించిన RCB యాజమాన్యం అప్రమత్తంగా ఉండకపోవడమా? అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ తప్పిదమా? భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల దోషమా? అసలు ఎవరెవరిని ప్రశ్నించాలి? ఇది కేవలం తొక్కిసలాట కాదు – ఇది అనేక వ్యవస్థల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం, అవగాహన లేమి కలగలిసిన చీకటి అధ్యాయం. ఓ గెలుపు క్షణం – మరెన్నో కుటుంబాల్లో శాశ్వత శోకం మిగిల్చింది.
Read Also : Magam Ranga Reddy : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి