టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ద్రవిడ్ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదం బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్రవిడ్ కు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ తో ద్రవిడ్ వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారును ద్రవిడ్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారా? లేక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ద్రావిడ్ కు ఆటో డ్రైవర్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇద్దరిలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బిజీ ఏరియా కన్నింఘమ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.ఈ సంఘటనకు సంబంధించి 11 సెకన్ల వీడియో వైరల్ గా మారింది. వీడియోలో.. ద్రవిడ్ కారులో నుంచి దిగి.. తన కారుకు జరిగిన డ్యామేజ్ ను పరిశీలించి, అనంతరం డ్రైవర్ ను కన్నడ భాషలో ప్రశ్నిస్తున్నట్లుగా కనిపించింది. డ్రైవర్.. యాక్సిడెంట్ ఎలా చోటు చేసుకుందో వివరిస్తున్నట్లుగా కూడా ఈ వీడియోలో ఉంది.