భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ వేడుకలు కాస్త హద్దు మీరాయి. రాత్రిపూట యువత రోడ్డుపై టపాసులు పేల్చుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో ఒక పోలీస్ వాహనం అటుగా రావడంతో, కొందరు యువకులు రాళ్లు రువ్వారు.జనం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కొందరు యువకులు వెనుక నుంచి పరిగెత్తుతూ పోలీస్ వాహనంపై దాడి చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఘటనకు సంబంధించి పోలీస్ వాహనంపై రాళ్లు రువ్విన యువకులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు
పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిలో ఇద్దరు యువకులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద నిందితులను 12 నెలల పాటు నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులకు గుండు కొట్టించి, వీధుల్లో ఊరేగించారు.పోలీసుల ఈ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఘటన వైరల్ అయ్యింది. కొందరు దీనిని పోలీసుల దాష్టీకంగా అభివర్ణించగా, మరికొందరు ఓవరాక్షన్ చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిరసనలు
యువకులకు గుండు కొట్టించి ఊరేగించిన ఘటనపై బాధితుల తల్లిదండ్రులు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజేను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “భారత క్రికెట్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసిన యువకులపై ఇలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం సరైనది కాదు. వేడుకల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు. కానీ, వారిని ఇలా అవమానించడం తగదు” అని పోలీసుల తీరును ఖండించారు.ఈ అంశంపై స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి)తో మాట్లాడిన ఎమ్మెల్యే, దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ పి స్పందిస్తూ, ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు “పోలీసుల చర్యలు అతిగా ఉన్నాయి” అని విమర్శిస్తుండగా, మరికొందరు “పోలీస్ వాహనంపై దాడి చేయడం తప్పు, అందుకే కఠినంగా శిక్షించాల్సిందే” అని అంటున్నారు.