పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల కలకలం రాజుకుంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఏప్రిల్ 30, మే 1 అర్ధరాత్రి సమయంలో జమ్ము కశ్మీర్‌లోని మూడు సరిహద్దు జిల్లాల్లోని పలు సెక్టార్లలో పాక్ ఆర్మీ నుండి కాల్పులు జరిగాయి.కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో ఉన్న భారత సైన్యం పైకి పాకిస్థాన్ కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ కవ్వింపులకు భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని సమాచారం. ఇదిలా ఉండగా, బారాముల్లా, పూంచ్ జిల్లాల్లో కూడా పాక్ కవ్వింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుంచీ ప్రతిరోజూ ఎల్టీసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. భారత్ ఆర్మీ దీటుగా బదులిచ్చి, పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

India : సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు – భారత్ గట్టి ప్రత్యుత్తరం
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం భారత్, పాక్ సైనికాధికారులు హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిన అంశంపై భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఇకపై ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పాకిస్థాన్‌కు గట్టిగా హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం. అలాగే ఏఏ తేదీలలో, ఏఏ ప్రాంతాల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలు జరిగాయో కూడా స్పష్టంగా వివరించినట్లు చెబుతున్నారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయడాన్ని నిలిపివేసిన ప్రభుత్వం, పాకిస్థాన్ పౌరులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలంటూ గడువు విధించింది. ఈ చర్యలపై పాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సిమ్లా ఒప్పందం సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనపెడతామని ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతలోకి వెళ్లాయి.
Read More : Pakistan hackers: పాక్ నకిలీ పీడీఎఫ్‌లతో భారతీయులే టార్గెట్!