పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ – పీజీ) 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. బోర్డు ఇలా పరీక్షను రెండు షిఫ్టులుగా నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
నీట్ – పీజీ 2025 పరీక్షా తేదీ
తాజా షెడ్యూల్ మేరకు నీట్ పీజీ పరీక్షను జూన్ 15వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీయే తెలిపింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి ఇతర ముఖ్యమైన సమాచారం, మరిన్ని వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను ‘ఎన్‌బీఈఎంఎస్’ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు.
పరీక్షా విధానం
నీట్ – పీజీ 2025 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్, కంప్యూటర్ లాగిన్ ప్రాసెస్ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. అందుకే, అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్‌కు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ఇంటర్న్‌షిప్
నీట్ – పీజీ పరీక్ష రాయదలచిన యూజీ మెడికల్ విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్‌ను జూలై 31లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎన్‌బీఈఎంఎస్ తెలిపింది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన విద్యార్థులనే నీట్ – పీజీ 2025 కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
అభ్యర్థులకు సూచనలు
నీట్ – పీజీ 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.పరీక్షా కేంద్రానికి 60-90 నిమిషాల ముందే చేరుకోవడం మంచిది, ఎందుకంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఇతర ప్రాసెస్‌లు ఉంటాయి. ఇంటర్న్‌షిప్ పూర్తయిన విద్యార్థులకే ప్రవేశానికి అర్హత ఉంటుంది, కాబట్టి గడువులోగా పూర్తి చేసుకోవాలి. పరీక్షకు సంబంధించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలు ఎన్‌బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి.నీట్ – పీజీ 2025 పరీక్షను జూన్ 15న రెండు షిఫ్టులలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందదలచిన విద్యార్థులు పరీక్షా నిబంధనలను గమనించి, సకాలంలో సన్నద్ధం కావాలి. అభ్యర్థులు ఎన్‌బీఈఎంఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.